ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పార్వతీపురం జిల్లా కురుపాం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన తల్లులు తమ పిల్లలను చదివించేందుకు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అమ్మబడి పథకాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. అమ్మబడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి 6392 కోట్లు జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయాన్ని తెలియజేయాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
నాలుగేళ్లలో విద్యారంగంపై 66 వేల 722 లక్షల రూపాయలు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. మూడవ తరగతి నుండే టోఫిల్ కరికులం తీసుకొస్తున్నామని, ఆరవ తరగతి నుండి ప్రతి స్కూళ్లలో క్లాస్ రూంలను డిజిటలైజేషన్ చేశామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఊళ్ళలో 8వ తరగతి నుండి ట్యాబ్స్ ను అందజేస్తున్నామని ఆయన అన్నారు. విద్యా దీవెన పథకం ద్వారా 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. గతంలో పెత్తందారులకు అందుబాటులో ఉండే చదువును ప్రస్తుతం పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. విధ్యారంగంపై తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను చూసి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
జగనన్న అమ్మఒడి పండుగను 10 రోజులపాటు నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్లాస్ టీచర్లకు గతిలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండేదని, ప్రస్తుతం మూడవ తరగతి నుండి సబ్జెక్టు టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పిల్లలకు గాని, అక్క చెల్లెమ్మలకు గాని, రైతులకు గాని ఫలానా మంచి చేశామని చెప్పుకునే దానికి చరిత్ర లేని చరిత్ర హీనుడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. మరోసారి అధికారం చేపట్టేందుకు మోసపూరిత మేనిఫెస్టోతో డ్రామాకు చంద్రబాబు దిగారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ధర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తదితర మంత్రులు విద్యార్థులు పాల్గొన్నారు.