జీఎస్టీ వసూళ్లు కేంద్రానికి కాసుల వర్షం కురిపిస్తోంది. జూన్ మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం నేడు వెల్లడించింది. గత నెలలో వసూలైన జీఎస్టీ రూ.1,61,497 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.31,013 కోట్లు అని, రాష్ట్ర జీఎస్టీ రూ.38,292 కోట్లు అని వివరించింది. సరుకు దిగుమతులపై సుంకం రూ.39,035 కోట్లతో కలిపి సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.80,292 కోట్లు, సెస్ రూ.11,900 కోట్లు (సరుకు దిగుమతులపై వసూలైన రూ.1,028 కోట్లతో కలిపి) అని పేర్కొంది. గతేడాది జూన్ తో పోల్చితే ఈ జూన్ లో వసూలైన జీఎస్టీ 12 శాతం అధికం. అదే సమయంలో గతేడాది జూన్ తో పోల్చితే ఈ జూన్ లో దేశీయ ఆర్థిక లావాదేవీల్లో 18 శాతం వృద్ధి నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఇక, జీఎస్టీ వసూళ్లు ఓ నెలలో రూ.1.60 లక్షల కోట్ల మార్కు దాటడం ఇది నాలుగోసారి.