ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఎఫ్‌ఎస్) పరీక్షల్లో తెలుగు యువకులు సత్తా చాటారు. బాపట్లకు చెందిన శ్రీకాంత్ జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలానికి చెందిన నారా భువనేశ్వర్ 31వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ రెండో ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. శనివారం పరీక్ష ఫలితాలు విడుదల అయిన సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. తనకు పర్యావరణ సంబంధమైన విషయాలపై ఆసక్తి ఎక్కువని, అందుకే ఈ విభాగాన్ని ఎంచుకున్నానని తెలిపారు. కాలుష్య నివారణ, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులపై పరిశోధన తదితర అంశాలతో పాటు అడవులను కాపాడటానికి కృషి చేస్తానన్నారు. మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని, చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మొదటి ర్యాంకు వచ్చింది కనుక ఆంధ్ర కేడర్ ఎంచుకునే అవకాశం ఉంటుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. కాగా, భువనేశ్వర్ గతేడాది మొదటిసారిగా ఐఎఫ్‌ఎస్ పరీక్షలు రాయగా అర్హత సాధించలేదు. అనంతరం పట్టుదలతో మళ్లీ పరీక్షలకు హాజరై ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.