అందివచ్చిన ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగం కూడా వినియోగించుకుంటోంది. పొలాల్లో ఎరువులు, పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్లను వినియోగించే రైతుల సంఖ్య క్రమంగా పెరుతోంది. కొంత మంది సొంతంగానే వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ రైతు మాత్రం ఏకంగా ఇందుకోసం ఏకంగా ఓ హెలికాప్టర్ కొనాలని నిర్ణయించుకున్నారు. కొండగావ్ జిల్లాకు చెందిన రాజారాం త్రిపాఠి తన వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షించేందుకు రూ.7 కోట్లతో ఈ హెలికాప్టర్ కొనుగోలు చేయనున్నారు. హాలెండ్‌కు చెందిన రాబిన్సన్ కంపెనీ ఆర్-44 మోడల్ (నాలుగు సీట్లు) హెలికాప్టర్‌ను బుక్ చేశారు.
తనకున్న 1,000 ఎకరాల పొలంలో ఎరువులు, పురుగు మందుల పిచికారీ, ఇతర వ్యవసాయ పనులకు అనుగుణంగా దీనిని రాజారాం తయారుచేయిస్తున్నారు. ఇంగ్లండ్, జర్మనీలో ఆయన పర్యటించినప్పుడు ఎరువుల పిచికారీకి హెలికాప్టర్ల వినియోగించడం చూసి ఆశ్చర్యపోయారు. మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అక్కడ వారి ద్వారా తెలుసుకున్న ఆయన.. తాను కూడా హెలికాప్టర్‌ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనిని నడపటానికి తన కుమారుడు, సోదరుడ్ని ఉజ్జయినిలోని ఏవియేషన్ అకాడమీకి పంపి పైలెట్ శిక్షణ ఇప్పించనున్నారు.
బస్తర్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాజారాం.. గతంలో బ్యాంకు ఉద్యోగం చేశారు. అయితే, వ్యవసాయంపై ప్రేమతో 1998లో ఉద్యోగం వదిలేసి రైతుగా మారారు. ప్రస్తుతం బస్తర్, కొండగావ్, జగదల్పూర్ జిల్లాల్లో అత్యధికంగా తెల్లముస్లి (తెల్ల నేలతాడి), నల్ల మిరియాలు పండిస్తున్నారు. ఓ హెర్బల్ సంస్థను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. వెయ్యి ఎకరాల్లో 400 మంది గిరిజన కుటుంబాల సాయంతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు.
ఏడాదికి రూ.25 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న రాజారాం.. ఐరోపా, అమెరికా దేశాలకు నల్ల మిరియాలను ఎగుమతి చేస్తున్నారు. మిరియాల పంట సాగులో ఆస్ట్రేలియా విధానాలను అవలంభిస్తున్నారు. చేతులతో రసాయనాలను పిచికారీ చేయడం వల్ల విస్తృతంగా చెల్లాచెదురుగా ఉంటాయని, చీడపీడల వ్యాప్తికి దోహదం చేస్తాయని అంటున్నారు. అదే, హెలికాప్టర్ నుంచి స్ప్రే చేయడం ద్వారా తగినంత మోతాదును జోడించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అయితే, రాజారాం త్రిపాఠీ తాత శుభ్‌నాథ్ త్రిపాఠీ ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ నుంచి 70 ఏళ్ల కిందట ఛత్తీస్‌గడ్‌లోకి బస్తర్ ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. రాజారాం తండ్రి జగదీశ్ ప్రసాద్ మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీవిరమణ చేశారు. జగదల్‌పూర్‌లో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఎస్బీఐలో పీఓగా చేరిన రాజారాం.. చివరకు వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు.