తిరుమల వెళ్లే మార్గంలో అలిపిరి తనిఖీ కేంద్రంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. తనిఖీలు లేకుండానే రెండు టీవీలను గుర్తు తెలియని వ్యక్తులు తిరుమలకి తీసుకుని వెళ్లడం కలకలంరేపింది. స్కూటీపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు తిరుమలకు చేరుకున్నారు. కొండపై జీఎన్సీ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌ను ఆపారు.. వారి దగ్గర చెక్ చేయగా టీవీలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
వీరిద్దరు తిరుమలలో కూడా టీవీలు అమ్ముకునేందుకు వచ్చారని చెబుతున్నారు. వీరిద్దరు తిరుపతిలోని ఓ లాడ్జిలో బస చేసినట్లు చెప్పారు.. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు చేస్తున్నారు. అయితే అలిపిరి దగ్గర ఎలాంటి తనిఖీలు చేయలేదని ఆ వ్యక్తులు చెబుతున్నారు. వాస్తవానికి తిరుమలకు ఎలక్ట్రానిక్ వస్తవుల్ని తీసుకెళ్లడం నిషిద్ధం అంటున్నారు. కొండపై ఉండేవారు అనుమతి తీసుకొని వెళతారట.. కానీ ఈ ఇద్దరు మాత్రం తనిఖీ కేంద్రం సిబ్బందికి దొరక్కుండా కొండపైకి వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన కుటుంబం ఏకంగా పెంపుడు కుక్కతో సహా తిరుమలకు వెళ్లారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర సిబ్బంది గమనించకపోవడంతో దర్జాగా కుక్కను కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ వారు ప్రయాణిస్తున్న ట్రావెలర్ వాహనంలో కుక్కను కొందరు గమనించారు. విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు వాహనాన్ని గుర్తించి కిందకు పంపించారు. గతంలో కూడా గంజాయి, మద్యం, మాంసం తిరుమలలో కలకలంరేపాయి. ఆ సమయంలో కూడా తనిఖీ కేంద్రంలో సిబ్బంది తీరుపై విమర్శలొచ్చాయి.