ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జూన్ 2 వ తేదీన జరిగిన రైలు ప్రమాద ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ - సీబీఐ తాజాగా ముగ్గురు రైల్వే శాఖ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. వారి నుంచి మరింత సమాచారం రాబట్టి ఈ ఘటన వెనకాల ఉన్న పూర్తి కారణాలను బయటికి తీయాలని భావిస్తోంది.
తాజాగా అరెస్ట్ అయిన ముగ్గురు ఉద్యోగుల వివరాలను సీబీఐ అధికారులు తెలిపారు. అఱుణ్ కుమార్ మహంతా, జూనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎండీ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌గా గుర్తించారు. ఈ ముగ్గురి మీద ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను నాశనం చేయడం సహా వివిధ అభియోగాలను వీరిపై సీబీఐ అధికారులు మోపారు. జూన్ 2 వ తేదీన ప్రమాదం జరగ్గా.. జూన్ 6 వ తేదీన సీబీఐ అధికారులు ఈ కేసును తమ అధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పలువురు రైల్వేశాఖ ఉద్యోగులు, సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు.. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా తాజా అరెస్ట్‌లు చేశారు.
ఒడిశాలోని బాలాసోర్ వద్ద జూన్ 2 వ తేదీన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు సహా మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 290 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇంకా కొంతమందిని గుర్తించకపోవడంతో ఆ మృత దేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌లో భద్ర పరిచారు. అయితే ఈ ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగే కారణమని ఇటీవల రైల్వే భద్రత కమిషనర్ సీఆర్ఎస్ దర్యాప్తు నివేదిక తేల్చి చెప్పింది.