మెగాస్టార్ చిరంజీవికి, ఆయన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి.. తాను రాజకీయాలకు పనికి రానని, తమ్ముడు పవన్ కళ్యాణ్ పనికొస్తారని గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. అంటే చంద్రబాబు చెప్పినట్లు తాను చేయలేనని.. పవన్ కళ్యాణ్ చేయగలడనే విషయం తెలుసు కాబట్టే ఆయన రాజకీయాలకు పనికొస్తాడని చిరంజీవి అన్నారని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పోర్టులు, మెడికల్ కాలేజీలు, పంచాయతీ భవనాలు కడుతున్నారని పేర్ని నాని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు హయాంలో తెచ్చిన అప్పులను పసుపు కుంకమకు తరలించారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పైసాకు పక్కా లెక్క ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్.. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి మోసం చేశారని పేర్ని నాని ఫైరయ్యారు. కాపు ఓట్ల కోసమే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోయినట్లు నటించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చేసే మోసాన్ని కాపులు గమనించి గత ఎన్నికల్లో జగన్‌కు ఓటేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకుంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మొక్కుతూ.. ఆయన్ను సార్ అని పిలుచుకుంటే తమకేం అభ్యంతరం లేదన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడితే.. తాము కూడా అదే విధంగా మాట్లాడతామని వార్నింగ్ ఇచ్చారు. పవన్ ఒక్కరికే నోరు, నాలిక లేదు.. వైసీపీ జెండా మోసే కార్యకర్తలకు కూడా ఉందని గుర్తుంచుకోవాలని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.