ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత మహిళ-పాక్ యువకుడి ప్రేమలో ట్విస్ట్

international |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2023, 09:54 PM

పబ్జీ గేమ్‌లో పరిచయమైన సచిన్ మీనా కోసం పాక్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ ఘటన ఇరుదేశాల మధ్య నడుస్తుండగానే.. ఇలాంటిదే మరో ఘటన జరిగింది. అయితే ఈసారి భారత్ నుంచి ఓ మహిళ పాకిస్థాన్ చేరుకోవడం గమనార్హం. పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లాతో ఏర్పడిన పరిచయంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అంజు అనే మహిళ అతని వద్దకు వెళ్లింది. అయితే ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారడంతో నస్రుల్లా, అతని కుటుంబం స్పందించింది. పాకిస్థాన్ చూడడానికి అంజు వచ్చిందని.. టూరిస్ట్ వీసా 30 రోజులు పూర్తి కాగానే.. భారత్ తిరిగి వెళ్తుందని వెల్లడించారు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని ప్రేమ లేదని నస్లుల్లా వెల్లడించారు.


2019 లో నస్రుల్లా, అంజూ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు. 29 ఏళ్ల నస్రుల్లా పాకిస్థాన్‌లోని పెషావర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైబర్ ఫక్తుంఖ్వాలోని కుల్షో గ్రామానికి చెందిననాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరోల్ గ్రామానికి చెందిన 34 ఏళ్ల అంజూ.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివసిస్తుంది. ఆమెకు పెళ్లయి 15 ఏళ్ల కుమార్తెతోపాటు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే నస్రుల్లా కోసం అంజూ ఇటీవల పాకిస్థాన్‌కు వెళ్లింది. ఆమె పాకిస్థాన్ నుంచి వీసా పొందిన తర్వాతే అన్ని పత్రాలతో వెళ్లినట్లు గుర్తించారు. అయితే తాను అంజూను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని.. తమ మధ్య ప్రేమ లేదని నస్రుల్లా వెల్లడించాడు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని.. అంజూ వీసా ఆగస్టు 20 వ తేదీ వరకు ఉందని.. ఆ తర్వాత ఆమె భారత్‌కు తిరిగి వెళ్తుందని వివరించాడు. షేరింగల్‌లోని యూనివర్సిటీ నుంచి నస్రుల్లా సైన్స్ గ్రాడ్యుయేట్ అయినట్లు తెలుస్తోంది. తన కుటుంబంలోని ఐదుగురు సోదరుల్లో నస్రుల్లా చిన్నవాడు.


ప్రస్తుతం అంజూ తమ ఇంట్లోనే ఉందని.. తన కుటుంబ సభ్యులతో వేరే గదిలో ఉంటున్నట్లు నస్రుల్లా వెల్లడించాడు. పాక్ వీసా సహా అన్ని రకాల పత్రాలతో పాకిస్థాన్ ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్‌దిర్ జిల్లాకు చేరుకుంది. 30 రోజుల వీసాను అంజూకు మంజూరు చేసినట్లు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు లేఖ పంపింది. వీసా కేవలం అప్పర్‌దిర్ జిల్లాకు మాత్రమే చెందిందని.. అంతకు మించి ఎక్కడా ప్రయాణించడానికి వీలు లేదని వెల్లడించింది. అయితే అప్పర్‌‌దిర్ జిల్లా పోలీస్ అధికారి ముస్తాక్.. అంజూను తన కార్యాలయంలో విచారణ జరిపారు. ఆమె ప్రయాణ పత్రాలు, వీసా, నో ఆబ్జెక్షన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. తమ గ్రామస్తులు ఎక్కువగా మతపరమైన వ్యక్తులు అయిన పాష్తూన్లని.. అందుకోసమే జిల్లా యంత్రాంగం తమకు తగిన భద్రత కల్పించిందని.. తన కుటుంబ సభ్యులతో అంజూ క్షేమంగా ఉన్నట్లు నస్రుల్లా వివరించాడు. ఈ ఘటనతో తన వర్గానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంజూ సురక్షితంగా భారత్‌కు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.


మరోవైపు.. రాజస్థాన్‌లో ఉన్న అంజూ భర్త అరవింద్.. తన భార్య త్వరలోనే ఇంటికి తిరిగివస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తమకు 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు చెప్పాడు. తమను వదిలిపెట్టి అంజూ పాకిస్థాన్ వెళ్లిందని వివరించాడు. గురువారం అంజూ ఇంటి నుంచి వెళ్లిందని అరవింద్ తెలిపాడు. అయితే జైపూర్‌కు వెళ్తానని చెప్పిందని.. తర్వాత అధికారుల ద్వారా ఆమె పాకిస్థాన్ వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నాడు. అయితే అంజూ పాకిస్థాన్ వెళ్లినా ఆమె భర్తగానీ, కుటుంబం గానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే అంజూ పాకిస్థాన్ వెళ్లినట్లు ఆమె సోదరికి వాట్సాప్ కాల్ ద్వారా చెప్పిందని అరవింద్ చెప్పాడు. అయితే తన భార్య అంజూ సోషల్ మీడియాలో ఎవరితో పరిచయం పెంచుకుందో తనకు తెలియదని అరవింద్ పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com