ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్‌స్టాగ్రామ్ లవర్‌ కోసం పాక్ వెళ్లేందుకు బాలిక యత్నం

national |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2023, 10:06 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలుడి కోసం ఓ 16 ఏళ్ల బాలిక భారత్ నుంచి పాక్ వెళ్లేందుకు ప్రయత్నించి అధికారులకు అడ్డంగా దొరికి పోయింది. అనంతరం వారికి ఓ కథ చెప్పింది. వీసా, పాస్‌పోర్టు లేకుండానే నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. బాలిక చెప్పిన విషయాలు నమ్మశక్యం కాకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ బాలికను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారి కుటుంబ సభ్యులను పిలిచి విచారణ జరిపారు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.


వీసా, పాస్‌పోర్టు లేకుండా జైపూర్ ఎయిర్‌పోర్టులోకి వెళ్లిన ఓ 16 ఏళ్ల మైనర్.. తాను పాకిస్థాన్ వెళ్లాలని టికెట్ ఇవ్వమని అడిగింది. దీంతో అక్కడ ఉన్న అధికారులు షాక్ అయ్యారు. పైగా పాకిస్థాన్‌లో ఉన్న తన ప్రియుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. తనది పాకిస్థాన్ అని.. తన పేరు ఘజల్ మహమ్మద్ అని మూడేళ్ల క్రితం తన అత్తతో పాక్ నుంచి భారత్‌కు వచ్చినట్లు చెప్పింది. ఇస్లామాబాద్ నుంచి భారత్ చేరుకున్నట్లు వివరించింది. అయితే ఇప్పుడు తన అత్త, వారి కుటుంబ సభ్యులు.. తనకు పెళ్లి చేయాలని చూస్తున్నారని తెలిపింది. దీంతో వారితో తనకు పడటం లేదని.. మళ్లీ పాక్ వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తమదైన శైలిలో ఆ బాలికను విచారణ చేయడంతో షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి.


పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉండే బాలుడు అస్లాంతో రాజస్థాన్ సికార్ జిల్లాలోని రత్నపుర గ్రామానికి చెందిన ఓ బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త.. ప్రేమగా మారడంతో ఆ బాలిక పాక్ వెళ్లాలని భావించింది. అందుకు తన ప్రియుడు అస్లాం కూడా ఒప్పుకున్నాడు. అయితే పాక్ వెళ్లడానికి బాలిక ప్రియుడు చెప్పిన కట్టుకథనే జైపూర్ ఎయిర్‌పోర్టు అధికారులకు చెప్పినట్లు తెలిపింది. అధికారులతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని.. కొన్ని విషయాలను మైండ్‌లో ఉంచుకోవాలని బాలుడు చెప్పినట్లు గుర్తించారు. దాన్ని బాలిక పక్కాగా అమలు చేసినా.. ఎయిర్‌పోర్టు అధికారులకు చిక్కింది. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు బాలురు కూడా తాను ఇంటి నుంచి జైపూర్ ఎయిర్‌పోర్టుకు వచ్చేందుకు సహాయపడ్డారని తెలిపింది. దీంతో వాళ్లను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.


ఈ ఘటనపై జైపూర్ ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. పాక్ వెళ్లాలని వచ్చిన ఓ బాలికను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తన ప్రియుడిని కలిసేందుకు లాహోర్‌ వెళ్లాలని.. టికెట్ కౌంటర్ వద్దకు చేరుకుని.. టిక్కెట్‌ ఇవ్వాలని కోరిందని చెప్పారు. అయితే మొదట బాలిక జోక్ చేస్తుందని అధికారులు భావించారని.. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలిక చెప్పేది నిజమని.. గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. అది విని అంతా షాక్ అయ్యామని తెలిపారు. తమ దర్యాప్తులో బాలిక రాజస్థాన్‌ సికార్‌ జిల్లాలోని రత్నపుర గ్రామానికి చెందిందని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అధికారులు బాలిక తల్లిదండ్రులను పిలిపించారు. వారి ముందే బాలికను ప్రశ్నించగా..చివరికి తల్లిదండ్రులను పిలిచి వారి ముందే మళ్లీ ప్రశ్నించారు. అనంతరం తల్లిదండ్రులతో పాటే బాలికను వారి ఇంటికి పంపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com