కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా పూర్తికాలేదు అప్పుడే అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. తమ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులను చేయలేకపోతున్నామని, మంత్రులెవరూ స్పందించడం లేదని ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్యకు రాసిన లేఖ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, మరో సంచలన లేఖ వెలుగుచూసింది. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు చేయలేకపోతున్నానని... తనను కనీసం ఏదో ఒక మంత్రికి పీఏగానో, ఓఎస్డీగానో నియమించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో ఎమ్మెల్యే లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయాన్ని గురువారం సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో సిద్ధరామయ్య బయటపెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలంటూ మంత్రులను సిద్ధరామయ్య మందలించారు. అయితే, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యంతో విభేదాలు సామరస్యంగా పరిష్కరించినట్టు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే లీకైన లేఖను ఓ జోక్ అని కొట్టిపారేశారు. గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు అందుబాటులోకి రావడం లేదని పలువురు ఫిర్యాదు చేశారని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. అయితే, తమ ఫిర్యాదుల్లో ఎమ్మెల్యేలు ఎవరూ ఏ మంత్రిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో చర్చించిన అంశాలలో కొంతమంది మంత్రులు సహకరించడం లేదని గుల్బర్గా జిల్లాకు చెందిన బీఆర్ పాటిల్ సహా 11 మంది ఎమ్మెల్యేలు రాసిన లేఖను ప్రస్తావించారు. ‘అయితే, సంతకం చేసిన వారిలో ఒకరు ఎన్నికలకు ముందు జేడీ(ఎస్) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే శివలింగగౌడ ‘కాంగ్రెస్ సంస్కృతి’గా భావించి లేఖపై సంతకం చేశానని చెప్పారు’ అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అన్నారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం.. సీఎం దృష్టిని ఆకర్షించేందుకే లేఖ రాశారని చెప్పగా.. సంతకం చేసిన చన్నగిరి ఎమ్మెల్యే బసవరాజ్ రాయ రెడ్డిని సిద్ధరామయ్య మందలించారు. అటువంటి వ్యూహాలకు పాల్పడకుండా నేరుగా ఫిర్యాదులను తన వద్ద ప్రస్తావించాలని ఆయన రెడ్డిని కోరారు. చన్నగిరి ఎమ్మెల్యే తన అభ్యర్థనపై ఎటువంటి స్పందన రాలేదని, కాబట్టి తనను ఓఎస్‌డీ లేదా ఏ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా నియమించాలని సీఎంను అభ్యర్థించారు. అయితే, తర్వాత ఈ లేఖ ఓ జోక్ అంటూ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకు నిధులు సరిపోవని, ఈ ఏడాది సర్దుకుపోవాలంటూ డిప్యూటీ సీఎం శివకుమార్ సూచించారు.