భారత్ జోడో యాత్ర పేరిటి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. 2.0కు సిద్ధమవుతున్నారంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ గాంధీ మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ‘భారత్ జోడో యాత్ర 2.0’ మొదలుకానుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ జోడో యాత్ర నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ చీఫ్ దిగ్విజయ్ సింగ్.. రెండో విడత యాత్ర కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.
గత వారం నుంచి పార్టీలోని పలువురు కీలక నేతలతో యాత్ర గురించి ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. యాత్ర 2 ప్రారంభ తేదీ, రూట్‌మ్యాప్ మీద ఇంకా చర్చలు జరపాల్సి ఉందని ఏఐసీసీ సభ్యుడు ఒకరు తెలిపారు. గతేడాది సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 2023 జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. తన పాదయాత్రను ప్రారంభానికి ముందు అహ్మదాబాద్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.
దీంతో గాంధీ జన్మస్థలం పోర్‌బందర్ నుంచి రెండో విడత యాత్ర మొదలుపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. పోర్‌బందర్ నుంచి పలు రాష్ట్రాల గుండా త్రిపురలోని అగర్తలతో యాత్ర ముగిసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో యాత్ర 2.0లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎక్కువ నియోజకవర్గాలు మీదుగా సాగేలా ప్లాన్ చేస్తున్నట్టు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిజ్‌లాల్ ఖబ్రీ అన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో దశలో యూపీలో ఎక్కువ సమయం గడపాలని పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర నాయకత్వం కోరుకుంటోందనిని ఖబ్రీ చెప్పారు. ఆయన యాత్ర 2.0 ఆగస్టు 15 లేదా అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో ఘజియాబాద్, భాగ్పత్, షామ్లీ జిల్లాల్లో మాత్రమే రాహుల్ పాదయాత్ర సాగింది.
రాహుల్ ఘజియాబాద్ నుంచి 130కిలోమీటర్లకు పైగా నడిచి హరియాణాలోకి ప్రవేశించారు. షామ్లీ, బాగ్‌పత్‌లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేశారు. యూపీలో రాహుల్ పాదయాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. రెండో దశలో రాష్ట్రంపై ఫోకస్ పెడతారని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రెండో దశలో రాహుల్ రెండు వారాలకు పైగా యూపీలో గడిపే అవకాశం ఉందని, ఈ మార్గం దాదాపు రెండు డజన్ల పార్లమెంటరీ నియోజకవర్గాలను కవర్ చేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ వర్గాలు తెలిపాయి.