పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానం.. భారత భూభాగంలోకి ప్రవేశించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోకి ప్రవేశించిన పాక్ విమానం.. 3 రాష్ట్రాల్లో గంటకుపైగా చక్కర్లు కొట్టింది. అయితే ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్పందించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి పీఐఏ-308 ప్యాసింజర్ విమానం ఇస్లామాబాద్‌కు బయల్దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. దీంతో విమానం.. వెళ్లాల్సిన మార్గం నుంచి తప్పించుకుంది. అనంతరం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు భారత్‌లోకి ప్రవేశించింది. అనంతరం ఆ విమానం గంటకు పైగా భారత గగనతలంపై ఎగిరింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించింది. సుమారు గంట 12 నిమిషాల పాటు ఈ 3 రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టింది. అయితే చివరికి సాయంత్రం 6 గంటల 14 నిమిషాలకు తిరిగి పాక్ గగనతలానికి ప్రవేశించింది.
ఈ ఘటనపై భారత అధికార యంత్రాంగానికి సమాచారం అందింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ప్యాసింజర్ విమానంపై తమకు వివరాలు వచ్చినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులకు తెలిపింది. అప్పుడప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా.. ఇలా పౌర విమానాలు దారి తప్పిపోయి.. సురక్షితమైన మార్గం కోసం వస్తాయని తెలిపారు. ఇటీవలి కాలంలో భారత్‌కు చెందిన విమానాలు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్సుల్లోని ప్రాంతాల్లో వాతావరణం చాలా క్లిష్టంగా ఉంటుంది. పాకిస్థాన్‌లోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపత్యంలోనే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇలా జరుగుతుందని పేర్కొన్నారు. ఇంతకుముందు జూన్ నెలలో ప్రతికూల వాతావరణం కారణంగా భారత్‌కు చెందిన ఓ విమానం కూడా దారి తప్పి పాక్ భూభాగంలోకి వెళ్లింది. అహ్మదాబాద్ నుంచి అమృత్‌సర్ వెళ్తున్న ఓ విమానం దారితప్పి.. దాదాపు అరగంట పాటు పాకిస్థాన్ సరిహద్దులోకి ప్రవేశించింది. పాక్ నుంచి భారత్‌లోకి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయానే ప్రశ్నకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు రక్షణ సలహాదారు మాలిక్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ అవును అనే సమాధానాన్ని ఇచ్చాడు. సరిహద్దుల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్లు హెరాయిన్‌ను సరఫరా చేసేందుకు డ్రోన్లను వాడతారని మీడియా ముందు అంగీకరించారు.