నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మాడ్యుల్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రముఖ వైద్యుడ్ని అదుపులోకి తీసుకుంది. పుణేకు చెందిన ప్రముఖ అనస్థీషియా నిపుణుడు డాక్టర్ అద్నాన్ అలీ సర్కార్‌ను ఎన్ఐఏ గురువారం అరెస్ట్ చేసింది. కోంధ్వాలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది. జూన్ 28న నమోదుచేసిన మహారాష్ట్ర ఐఎస్ మాడ్యుల్ కేసులో ఐదో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో జులై 3న ముంబయికి చెందిన తబీష్ నషీర్ సిద్ధిఖీ, పుణేకు చెందిన జుబెయిర్ నూర్ మహ్మద్ షేక్ అలియాస్ అబు నుసైబా, థానేకు చెందిన ష్రీజల్ షేక్, జుల్ఫికర్ అలీ బరోడావాలాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
డాక్టర్ అలీ సర్కారు నివాసంలో ఐఎస్ఐఎస్‌కు సంబంధించి నిషేధిత సామాగ్రితో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. దర్యాప్తు సంస్థ ప్రకారం ఇస్లామిక్ స్టేట్ లేదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా లేదా దైష్/ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావిన్స్ విలాయత్ ఖొరాసన్/ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ షామ్ ఖొరాసన్ వంటి విభిన్న పేర్లతో పిలిచే ఐఎస్ తీవ్రవాద కార్యకలాపాలకు పెద్ద ఎత్తున్న కుట్రలు పన్నినట్టు గుర్తించారు.
ఐఎస్ఐఎస్ కుట్రలో భాగంగా మహారాష్ట్ర ఐఎస్ మాడ్యూల్ ద్వారా దేశ ఐక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్కార్ కుట్రలు చేసినట్టు గుర్తించామని ఎన్ఐఏ పేర్కొంది. మహారాష్ట్ర ఐఎస్ మాడ్యూల్ కేసు దర్యాప్తును కొనసాగిస్తామని తెలిపింది.
డాక్టర్ అద్నాన్ అలీ సర్కార్‌కు అత్యంత క్లిష్టమైన అనస్థీషియా చికిత్సలో 16 సంవత్సరాల అనుభవం ఉంది. పుణేలోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 2001లో ఎంబీబీఎస్, 2006లో అదే కళాశాల నుంచి అనస్థీషియాలో ఎండీ పూర్తి చేశాడు. ఇంగ్లీష్, మరాఠీ, హిందీ, జర్మన్ భాషలను మాట్లాగలిగే సర్కార్.. పలువురు నిపుణులతో కలిసి 18 పరిశోధన పత్రాలను ప్రచురించారు. అనస్థీషియాలో సర్జికల్ ప్లెత్ ఇండెక్స్, డెక్స్‌మెడెటోమిడిన్ గురించి అవగాహన చేసుకోవడంలో కీలక సహకారం అందించారు. తన వైద్యవృత్తిని పక్కనబెట్టిన డాక్టర్ అద్నాన్ అలీ సర్కార్.. ఐఎస్ కోసం రిక్రూట్‌మెంట్, ఉగ్రదాడులకు ప్లాన్ చేయడం గమనార్హం.