"నేను నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను" అంటూ ఓ హైకోర్టు జడ్జి అప్పటికప్పుడే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఆ సమయంలో కోర్టులో ఉన్న పోలీసులు, లాయర్లు, నిందితులు, న్యాయ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియక ఒక్క క్షణం అలాగే నిలబడిపోయి ఉన్నారు. అప్పటివరకు వేర్వేరు కేసుల్లో వాదనలు వింటూ.. వాయిదాలు, ఉత్తర్వులు, తీర్పులు ప్రకటించిన ఆ హైకోర్టు న్యాయమూర్తి.. ఒక్కసారిగా రిజైన్ విషయం చెప్పడం అక్కడ ఉన్న వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయనే బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ జడ్జి జస్టిస్ రోహిత్ డియో. ఈ విషయాన్ని ఆ సమయంలో అక్కడే ఉన్న మరో లాయర్ వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.
అది నాగ్‌పుర్‌లో ఉన్న బాంబే హైకోర్టు బెంచ్. కోర్టు హాలులో జడ్జి జస్టిస్ రోహిత్ డియో, ఇతర న్యాయవాదులు, కేసు విచారణకు హాజరైన నిందితులు, పోలీసులు, ఇతర సిబ్బంది అందరూ ఉన్నారు. ఆ సమయంలో కొన్ని కేసులను జస్టిస్ రోహిత్ డియో విచారణ జరిపారు. ఉన్నట్టుండి ఒక్కసారి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడి తాను ఆ పదవిలో ఉండదలచు కోలేదని జస్టిస్ రోహిత్ డియో చెప్పినట్లు మరో లాయర్ బయటికి వచ్చిన తర్వాత చెప్పారు. ఈ సందర్భంగా కోర్టులో ఉన్న న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. తాను ఎన్నోసార్లు వారిపై ఆగ్రహం, కోపం వ్యక్తం చేశానని అన్నారు. అవన్నీ ఆయా కేసు విచారణలో భాగంగానే జరిగిందని.. వారిని బాధపెట్టాలని తాను అలా చేయలేదని వారికి వివరించారు. వారు జీవితంలో, వృత్తిలో మరింత మెరుగుపడాలని.. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకే అలా అన్నట్లు వెల్లడించారు.
కోర్టులో ఉన్న వారందరూ తన కుటుంబ సభ్యుల్లాంటివారని అన్నారు. తాను రాజీనామా చేశానన్న విషయం చెబుతున్నందుకు తనను క్షమించాలని కోరారు. తాను తన జడ్జి పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని ఆ పదవిలో పనిచేయలేనని.. మిగిలిన వారంతా కష్టపడి పనిచేయాలని జస్టిస్ రోహిత్ డియో చెప్పినట్లు న్యాయవాది తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత బయటికి వచ్చిన జస్టిస్ రోహిత్ డియో.. మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశానని.. అయితే అవేంటో మాత్రం ఆయన చెప్పడానికి నిరాకరించారు.
పలు కీలక కేసు విచారణలో జస్టిస్ రోహిత్ డియో పాత్ర ఉంది. నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాను.. గతేడాది జస్టిస్ రోహిత్ డియో నిర్దోషిగా ప్రకటించారు. ప్రొఫెసర్ సాయిబాబాకు విధించిన జీవిత ఖైదును కొట్టేస్తూ జస్టిస్ రోహిత్ డియో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతోపాటు నాగ్‌పూర్ - ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 3వ తేదీన చేసిన తీర్మానంపై నకూడా గత వారం జస్టిస్ రోహిత్ డియో స్టే విధించారు. 2016 వరకు మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన జస్టిస్ రోహిత్ డియో.. 2017లో బాంబే హైకోర్టు జడ్జిగా నియామకం అయ్యారు. 2025 డిసెంబరుతో జస్టిస్ రోహిత్ డియో పదవీకాలం ముగియనుండగా.. రెండేళ్ల ముందుగానే జస్టిస్ రోహిత్ డియో తన పదవికి రాజీనామా చేశారు.