ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్,,,తోషాఖానా కేసులో దోషిగా తేల్చిన కోర్టు

international |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2023, 09:35 PM

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ దోషిగా తేలారు. ఈ మేరకు శనివారం ఇస్లామాబాద్‌ జిల్లా, సెషన్స్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తోషాకానా అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. శిక్షకు అదనంగా రూ. లక్ష జరిమానాను కూడా వేసింది. జరిమానా కట్టని పక్షంలో మరో 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించింది. వీటికి అదనంగా .. ఐదేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌ఖాన్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో పాక్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావాలనే ఇమ్రాన్‌ఖాన్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని ఇమ్రాన్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.


తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు వెంటనే జడ్జి హుమాయున్ దిలావార్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. కోర్టు అరెస్ట్ వారెంట్ అందుకున్న పోలీసులు హుటాహుటిన లాహోర్‌లో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ నివాసానికి చేరుకున్నారు. తీర్పు వచ్చిన క్షణాల వ్యవధిలో భారీ బందోబస్తుతో ఇమ్రాన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే శిక్షపై స్పందించిన ఇమ్రాన్‌ఖాన్.. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తన న్యాయ బృందం తక్షణమే అప్పీల్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేసులో సాక్షులను హాజరుపరిచేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని.. తమ వైపు వాదనలను పూర్తి చేయడానికి సమయం కూడా కేటాయించలేదని న్యాయ బృందం పేర్కొంది.


తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష పడటం.. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయడంతో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీకి అర్హత లేకుండా పోయింది. మరోవైపు.. ఆగస్టు 9 వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇప్పటికే ప్రకటించారు. నేషనల్ అసెంబ్లీ రద్దయిన తర్వాత 90 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఎన్నికల ముందు ఇమ్రాన్‌కు శిక్ష, అనర్హత వేటు పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీటికి తోడు వచ్చే ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పోటీ చేస్తారని పీఎం షెహబాజ్‌ ఇప్పటికే వెల్లడించడం గమనార్హం.


గతేడాది ఏప్రిల్‌ వరకు ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఓడిపోవడంతో ప్రధానమంత్రి పదవి పోయింది. అనంతరం ఆయనపై పలు కేసులు చుట్టుముట్టాయి. ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఇమ్రాన్‌ఖాన్‌కు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు కాగా విచారణ జరిపిన ఇస్లామాబాద్ కోర్టు.. శనివారం తుది తీర్పు వెలువరించింది.


దాదాపు 58 ఖరీదైన బహుమతులను ప్రధాని పదవిలో ఉండగా.. ఇమ్రాన్‌ఖాన్ అందుకున్నారు. అయితే ప్రధానిగా విదేశీ పర్యటనల్లో వచ్చిన గిఫ్ట్‌లను తోషాఖానాలో జమ చేయాలి. లేదా వాటిని తీసుకోవాలంటే నిబంధనల ప్రకారం సగం ధరం చెల్లించి తీసుకోవాలి. అయితే ఆ గిఫ్ట్‌లను సగం ధరకు కాకుండా.. చాలా తక్కువ ధరకు ఇమ్రాన్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.38 లక్షల విలువైన రొలెక్స్‌ గడియారాన్ని కేవలం రూ.7,54,000 చెల్లించారని.. రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్‌ వాచ్‌ను రూ.2,94,000 మాత్రమే ఇచ్చినట్లు గుర్తించారు. అయితే ఇలా తక్కువ మొత్తం చెల్లించి గిఫ్ట్‌లను తీసుకున్న ఇమ్రాన్ ఖాన్.. మరో రూ.8 లక్షల విలువైన బహుమతులను ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించకుండా తీసుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ వస్తువులను దుబాయిలో ఇమ్రాన్‌ఖాన్ విక్రయించినట్లు మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com