అఫ్గనిస్థాన్‌లోని హిందూ కుష్ పర్వత ప్రాంతంలో శనివారం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఇది ఉత్తర భారతాన్ని కూడా ప్రభావితం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పొరుగున్న ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అఫ్గనిస్థాన్‌లో తరుచుగా భూకంపాలు సంభవిస్తాయి. ముఖ్యంగా యురేషియన్, భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉన్న హిందూ కుష్ పర్వత శ్రేణులు భూకంపాల జోన్‌లో ఉన్నాయి. ‘ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి’ అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ డైరెక్టర్ జేఎల్ గౌతమ్ వెల్లడించారు.
అయితే, భూకంప నష్టం గురించి తక్షణమే ఎటువంటి వివరాలు తెలియరాలేదు. భూకంపం కేంద్రం, ఆస్తి, ప్రాణనష్టం, గాయపడినవారి గురించి సమాచారం లేదు. భూప్రకంపనలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో స్పందించారు. ‘ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అటు, ‘ఢిల్లీ ప్రజలారా మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం.. ఏదైనా అత్యవసర సహాయం కోసం 112కు డయల్ చేయండి’ అని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్‌లో సూచించారు.
రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. హిందూ కుష్ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప కేంద్రం 181 కి.మీ. లోతులో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని గుల్మార్గ్ జిల్లాకు 418 కి.మీ. దూరంలో ఉంది. రాత్రి 9.30 గంటల సమయంలో పలుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయని నొయిడాకు చెందిన ప్రీతీ శంకర్ అనే వ్యక్తి తెలిపారు. తమ అపార్ట్‌మెంట్ భవనంలోని సామాగ్రి ఊగిపోయిందని ఆమె అన్నారు. కాగా, ఇటీవల ఉత్తరాది సహా అండమాన్ దీవుల్లో తరుచూ స్వల్ప తీవ్రతతో భూకంపాలు, భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. గతవారం అండమాన్‌లో 4.9 తీవ్రతో భూకంపం సంభవించింది.