కృత్రిమ మేధ తన జీవితాన్ని తల్లకిందులు చేసిందని కోల్‌కతాకు చెందిన ఓ 22 ఏళ్ల యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఛాట్ జీపీటీ వల్ల తన ఆదాయం ఎలా తగ్గిపోయిందో సోషల్ మీడియాలో వివరించారు కోల్‌కతాకు చెందిన శరణ్య భట్టాచార్య. కృత్రిమ మేధతో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం డిగ్రీ చదువుతోన్న శరణ్య.. స్థానికంగా క్రియేటివ్ సొల్యూషన్స్ ఏజెన్సీకి కాపీరైటర్‌గా ఫ్రీలాన్సింగ్ చేస్తోంది. తద్వారా వచ్చిన డబ్బులతో ఆమె చదువు కుంటోంది. ఎస్‌ఈవోకి అనుగుణంగా కథనాలు రాసి నెలకు దాదాపు రూ.20,000 వరకు సంపాదించేది.
కానీ, చాట్‌జీపీటీ వినియోగంలోకి వచ్చిన తర్వాత శరణ్య జీవితాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. గతేడాది చివరితో పోల్చితే వర్క్‌లోడ్ బాగా తగ్గిపోయి.. నెలకు 1 లేదా 2 కథనాలకు మాత్రమే ఆ ఏజెన్సీ అవకాశం కల్పిస్తోంది. ఎక్కువ కథనాలు రాసేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ సంస్థ అడిగితే వారి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. తాను చేసే పనిని కృత్రిమ మేధతో ఆ సంస్థ చేయించుకుంటోందని.. అందుకే తక్కువ పనిని తనకు అప్పగిస్తున్నారని శరణ్య పేర్కొన్నారు. ఫ్రీలాన్సింగ్ ద్వారా వచ్చిన ఆదాయంతో చదువు కొనసాగించడమే కాకుండా ఇంటిదగ్గరున్న 45 ఏళ్ల తన తల్లికి కూడా చేదోడు వాదోడుగా నిలిచేదాన్నని, తన సంపాదనలో కోత ప్రభావం కుటుంబంపైనా పడిందని శరణ్య వాపోయింది.
తన తల్లి చీరలు విక్రయిస్తారని, ఖర్చుల కోసం ఆమెను డబ్బులు అడగడం బాధగా ఉందని శరణ్య తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటి ఖర్చుల కోసం లెక్కలు వేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘మనం ఎంత తింటున్నామో గమనించాల్సి వస్తోంది.. తినడానికి బయటికి వెళ్లడం వంటి చిన్న చిన్న సంతోషాలను పక్కనబెట్టేశాం.. మేము ఇప్పుడు ప్రతి రెండు నెలలకు ఒకసారి మాత్రమే రెస్టారెంట్‌కు వెళ్లగలం.. ఆహారం, బిల్లుల వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చుచేయాల్సి వస్తోంది’అని పేర్కొంది.
ఎవరిపైనా ఆధారపడకుండా చదువు కొనసాగించానని, కృత్రిమ మేధ తన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు, గత రెండు నెలలుగా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వివరించింది. యంత్రాలు చేసే పనికి, మనుషులు చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంటుందన్న ఆమె.. ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. లేదంటే చాలా మంది రోడ్డున పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘‘భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కాపీ రైటర్‌లు దీనివల్ల ప్రభావితమవుతున్నారు.. భవిష్యత్తులో మానవులు తమ రాత నైపుణ్యాలను కృత్రిమమేధతో అనుసంధానించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మార్గం ఉంటుందని ఆశిస్తున్నాను’’ అంటూ భట్టాచార్య రాసుకొచ్చింది.