అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ నిపుణుడు 400 కిలోల బరువైన తాళం రూపొందించాడు. తాళాల పరిశ్రమకు గుర్తింపు పొందిన అలీగఢ్ నగరానికి చెందిన సత్యప్రకాశ్ శర్మ దీనిని తయారు చేశారు. రాముడికి పరమ భక్తుడైన శర్మ.. తాళాల తయారీలో నైపుణ్యం కలిగిన పనివాడు. వీరి కుటుంబం 100 సంవత్సరాలకు పైగా తాళాల తయారీ పనులు చేస్తోంది.
అయోధ్య రామమందిరం కోసం సత్యప్రకాశ్ శర్మ కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారుచేసిన తాళాన్ని సిద్ధం చేశారు. దీనిని త్వరలోనే రామమందిరానికి అందజేయనున్నారు. ఆలయాన్ని దృష్టిలో ఉంచుకుని 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళం.. నాలుగు అడుగుల చెవిని తయారుచేశానని శర్మ వెల్లడించారు. కాగా, అరుదైన తాళాన్ని ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన అలీగఢ్ వార్షిక తాళాల ప్రదర్శనలో ఉంచారు.
ప్రస్తుతం తాళానికి సంబంధించి అతి సూక్ష్మ మార్పులు, వివిధ రకాల అలంకరణలు చేస్తున్నారు. ఈ తాళం తయారీలో తన భార్య రుక్మిణి ఎంతగానో సహకరించిందని, తయారీకి రూ.2 లక్షలు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. ‘ఆలయానికి ఒక పెద్ద తాళం వేయాలనే ఆలోచన వచ్చింది.. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన అంశం’ అని శర్మ పేర్కొన్నారు. ఇంటి బయట ఆ తాళాన్ని ప్రదర్శనకు ఉంచారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీనియర్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాను దీనిపై సంప్రదించగా.. ‘తాళాన్ని తీసుకోవాలా? వద్దాణ అనేది వ్యాఖ్యానించే ముందు ఇతరులతో మాట్లాడాలి’అని అన్నారు. కాగా, జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు అనేక మంది భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తున్నారు. జనవరి 2024లో ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం జరగాల్సి ఉంది.