వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ ని పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి కలిశారు. తన ఉన్నత చదువు కోసం గతేడాది జూలైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా చేసిన సాయానికి గానూ సీఎం వైయస్ జగన్‌ను తన కుటుంబ సభ్యులతో సహా కలిసి జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జాహ్నవి ఏవియేషన్ శిక్షణకు ప్రభుత్వం తరఫున సీఎం వైయస్ జగన్ రూ. 50 లక్షల సాయం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి.. అమెరికా ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. జాహ్నవి విజ్ఞప్తిపై సీఎం వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.