ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లోనే భారీగా రోగులు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని థానే ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభుత్వాస్పత్రిలో అనారోగ్యం కారణంగా 18 మంది మృతిచెందారు. దీంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. రెండు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ ఆదేశాలు జారీచేశారు. వయో భారం, ఆరోగ్యం విషమించిన తర్వాత ఆస్పత్రికి రావడంతో మరణాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
భారీగా మరణాలు చోటుచేసుకోవడంతో ఆస్పత్రి వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించినట్టు డీసీపీ గనేశ్ గావ్డే వెల్లడించారు. ఆస్పత్రి వైద్య విద్యా పరిధిలో ఉన్నందున ఆ శాఖ మంత్రి ముష్రిఫ్ సమీక్షిస్తున్నట్లు మంత్రి సావంత్ పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మహిళలు.. 8 మంది పురుషులు ఉన్నారు. వీరిలో ఆరుగురు థానేకు చెందినవారు.. నలుగురు కళ్యాణ్, ముగ్గురు షాపూర్, భివాండి, ఉల్హాస్‌నగర్, గొవాండిలకు చెందిన ఒక్కొక్కరు ఉండగా.. మరో ఇద్దరు ఎక్కడివారు అనేది తెలియాల్సి ఉంది.
మృతుల్లో 12 మంది 50 ఏళ్లు దాటినవారే ఉన్నారని ఆస్పత్రి డీన్ తెలిపారు. కిడ్నీ స్టోన్స్, క్రానిక్ పరాలిసిస్, అల్సర్లు, న్యూమోనియా వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని చెప్పారు. రోగులకు అందించిన చికిత్సపై దర్యాప్తు చేస్తున్నాం.. మరణించిన వారి బంధువుల స్టేట్‌మెంట్‌లు నమోదు చేస్తాం.. కొంతమంది బంధువులు నిర్లక్ష్యానికి పాల్పడినట్లు ఆరోపణలు చేయడం చాలా తీవ్రమైన విషయం.. దీనిని దర్యాప్తు కమిటీ పరిశీలిస్తుంది’ అని అధికారులు తెలిపారు.
‘మొత్తం 500 మంది కోవిడ్ సిబ్బందిని ఈ ఆసుపత్రికి మార్చారు.. అదనపు నర్సింగ్ సిబ్బందిని నియమించారు. మేము 24 గంటల పోస్ట్‌మార్టం సౌకర్యాన్ని కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆయన విలేకరులతో అన్నారు. 500 మంది రోగులుండే ఆసుపత్రిలో ఒకే రోజు 16 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోందని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత గిరీష్ మహాజన్ అన్నారు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆసుపత్రి నిర్వహణ సరిగా లేదని స్థానిక ఎమ్మెల్యే, ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ తెలిపారు. ఈ మరణాలు దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని మరో మంత్రి అదితి తత్కారే వ్యాఖ్యానించారు. అయితే, 500 మంది సామర్థ్యం కలిగిన ఆస్పత్రిలో 650 మందికిపైగా రోగులు ఉన్నారని థానే మాజీ మేయర్, సీఎం ఏక్‌నాథ్ షిండే అధికార ప్రతినిధి నరేశ్ మహక్సేనా అన్నారు.