2022 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల పరిధిలో నమోదైన అవినీతి కేసులపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ తాజాగా నివేదిక విడుదల చేసింది. గత సంవత్సరం అన్ని విభాగాల్లో కలిపి ప్రజల నుంచి 1.15 లక్షల అవినీతి ఫిర్యాదులు అందినట్లు నివేదికలో పేర్కొంది. ఇందులో అత్యధిక ఫిర్యాదులు కేంద్ర హోం శాఖలోనే వచ్చినట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇండియన్ రైల్వేలు, బ్యాంకులు ఉండటం గమనార్హం.
2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 1.15 లక్షల ఫిర్యాదులు రాగా.. అందులో 85,437 ఫిర్యాదులను పరిష్కరించినట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ వెల్లడించింది. ఇందులో మరో 29 వేల అవినీతి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు సీవీసీ తెలిపింది. ఈ 29 వేల ఫిర్యాదుల్లో 22 వేల ఫిర్యాదులు.. 3 నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు.. గతేడాది వచ్చిన మొత్తం 1.15 లక్షల ఫిర్యాదుల్లో అత్యధికం 46,643 అవినీతి ఫిర్యాదులు ఒక్క హోం మంత్రిత్వశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులపైనే వచ్చాయని సీవీసీ నివేదిక బహిర్గతం చేసింది. అంటే దాదాపు 40 శాతం కేసులు ఈ ఒక్క హోం శాఖ పరిధిలోనే వచ్చాయని పేర్కొంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో 10,850 అవినీతి ఫిర్యాదులతో రైల్వేలు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో 8129 అవినీతి ఫిర్యాదులతో బ్యాంకులు ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ గణాంకాలు వెల్లడించింది.
ఇక.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులపై 7370 అవినీతి ఫిర్యాదులు వచ్చినట్లు సీవీసీ నివేదిక చెబుతోంది. ఇందులో ఎక్కువగా ఢిల్లీ డెవలెప్‌మెంట్ అథారిటీలోనే ఉండగా.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ వంటి విభాగాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు.. బొగ్గు మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులపై 4304 అవినీతి ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్మిక శాఖలో 4236, పెట్రోలియం శాఖ ఉద్యోగులపై 2617 ఫిర్యాదులు వచ్చినట్లు సీవీసీ నివేదిక పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌లో 2150, రక్షణశాఖలో 1619 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ వెల్లడించింది.