ఆఫీసుకు వెళ్తోన్న ఇస్రో శాస్త్రవేత్తపై ఓ యువకుడు దాడికి పాల్పడిన ఘటన రెండు రోజుల కిందట బెంగళూరులో చోటుచేసుకుంది. స్కూటీతో వెళ్తోన్న నిందితుడు.. శాస్త్రవేత్త కారును అడ్డగించాడు. కారు టైర్లను తంతూ.. బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. సైంటిస్ట్ కార్డు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డు కాగా.. ఈ వీడియో ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇస్రో సైంటిస్టు ఆశిష్ లంబా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి, వివరాలు వెల్లడించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎప్పటిలాగే తాను మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళుతుండగా.. కొత్తగా నిర్మించిన హెచ్ఏఎల్ అండర్‌పాస్ వద్ద హెల్మెట్ లేకుండా స్కూటీ నడుపుతున్న యువకుడు వాహనం ముందుకు వచ్చాడని సైంటిస్ట్ ఆశిష్ లంబా తెలిపారు. నిర్లక్ష్యంగా బండి నడపడమే కాకుండా.. తన కారును అడ్డగించాడని చెప్పారు. అనంతరం అసభ్య పదజాలంతో దూషిస్తూ కారు టైర్లను తన్నతూ దాడికి యత్నించాడని ఆశిష్ ఆరోపించారు. వార్నింగ్ కూడా ఇచ్చాడని అన్నారు. కారులో తనతో పాటు తన కొలీగ్స్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. నిందితుడి వాహనం నెంబరు (KA03KM8826)ను కూడా ఆయన షేర్ చేశారు.
ట్విట్టర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. శాస్త్రవేత్తపై దాడికి ప్రయత్నించిన నిందిత యువకుడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు స్పందించారు. కేసు నమోదుచేసి... వీడియో ఆధారంగా సదరు యువకుడిని గుర్తించే చర్యలు చేపట్టామని వెల్లడించారు. వివరాలు అందించాలంటూ సైంటిస్టు ఆశిష్ లంబాను పోలీసులు కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుల స్పందించడం పట్ల వారికి ఆశిష్ లంబా ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.