ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని.. పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఈ క్రమంలోనే జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాజాగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై గత కొంత కాలంగా విచారణ జరుపుతున్న దేశ అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన కేంద్ర ప్రభుత్వం జమ్మ కశ్మీర్‌లో ఏ క్షణమైనా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా అని సుప్రీం కోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం గురువారం సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందిస్తున్నామని తెలిపింది. అయితే దీనికి కొంత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కొద్ది రోజులుగా సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే లడఖ్‌కు కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా కొంత కాలం మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం జమ్ము కశ్మీర్‌పై దాఖలైన వాదనలపై విచారణ జరుపుతోంది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతోనే జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించారనే అంశాన్ని ధర్మాసనం ఏకీభవిస్తుందని.. అదే సమయంలో ప్రజాస్వామ్యం కూడా చాలా ముఖ్యమైందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే జమ్ము కశ్మీర్లో ఎక్కువ కాలం ఎన్నికలు జరగకుండా ఉండటాన్ని తాము అనుమతించమని సృష్టం చేసింది.
జమ్ము కశ్మీర్‌లో నివసిస్తున్న ప్రజలు అందరూ కలిసి కోరుకున్నా ఆర్టికల్ 370 రద్దు చేసేందుకు ఎలాంటి వ్యవస్థ లేదా అని ఆగస్టు 3 వ తేదీన జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 370 ని ముట్టుకునే అవకాశమే లేకపోతే.. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి మించిన ఓ కేటగిరీని తయారు చేసినట్లు అవుతుంది కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ రద్దుతో ఆర్టికల్ 370 శాశ్వతత్వం పొందిందా ఆ ఆర్టికల్ రద్దు చేయడానికి పాటించిన ప్రక్రియ సరైనదేనా అనే ప్రశ్నలు మాత్రమే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వ్యాఖ్యానించింది.