జీ20 శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకుని విదేశీ నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వాన పత్రికలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించడంతో రాజకీయ వివాదం మొదలైన విషయం తెలిసిందే. ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చేస్తారంటూ ఎడతెగని చర్చ జరుగుతోంది. తాజాగా, ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. పేర్ల మార్పుపై సభ్య దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
‘ఇండియా’ పేరు ఇంగ్లిష్‌లోనూ‘భారత్ ’గా మారనుందా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ స్పందించారు. గతేడాది టర్కీ తన పేరును ‘తుర్కియే’గా మార్చుకున్న అంశాన్ని ఉదహరణగా పేర్కొన్నారు. ‘తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం పంపిన అధికారిక అభ్యర్థనను స్వీకరించి సానుకూలంగా స్పందించాం.. అలాగే, ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే వాటిని మేం పరిగణనలోకి తీసుకుంటాం’ అని హక్ తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ఆహ్వాన పత్రికల్లో 'President of India'కు బదులుగా 'President of Bharat' అని ముద్రించడం, విదేశీ అతిథులకు పంపిణీ చేయనున్న బుక్‌లెట్‌లపై ఇండియాకు బదులు భారత్ అని పేర్కొనడం.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని కూడా ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని ప్రస్తావించడం వంటివి చర్యలతో ఇకపై ‘ఇండియా’ పేరు స్థానంలో ఇంగ్లీషులోనూ ‘భారత్’గా మార్చే దిశగా మోదీ సర్కారు అడుగులు వేస్తోన్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.
దీంతో ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టుకోవడంతోనే బీజేపీకి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తాయి. అయితే, బీజేపీ సైతం వీటిని ధీటుగా తిప్పికొడుతోంది. రాజ్యాంగం ప్రకారం దేశం పేరు ‘భారత్’ అని ఉందని, అలా రాయడంలో తప్పులేదని సమర్దించుకుంటోంది. అటు ప్రధాని మోదీ కూడా దీనిపై స్పందిస్తూ.. కేంద్ర మంత్రులకు పలు సూచనలు చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జీ 20 సదస్సు గురించి మంత్రులతో సమావేశం సందర్భంగా పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ‘భారత్’ అంశంపై ఆచిచూతి వ్యవహరించాలని, అనవరస వ్యాఖ్యాలను చేయొద్దని సూచించినట్లు సమాచారం. కేవలం జీ20 సదస్సు విజయవంతం చేయడంపై దృష్టిపెట్టాలని, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని మోదీ చెప్పినట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa