లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇదొక సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం బీజేపీ రాజకీయ ఎజెండా కాదని తెలిపారు. అదే సమయంలో మహిళా సాధికారత అనేది కొన్ని పార్టీలకు రాజకీయ అంశమని మండిపడ్డారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అవుతుందని అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా జనగణన నిర్వహించి.. జనాభా ఆధారంగా దేశంలో ఉన్న నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాతే ఈ మహిళా రిజర్వేషన్లపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపారు. అందుకే 2029 ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఈ మహిళా రిజర్వేషన్లు అమలు అవుతాయని అమిత్ షా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఆగమేఘాల మీద ఇప్పటికిప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేస్తే లేనిపోని కొత్త సమస్యలు వచ్చి పడతాయని పేర్కొన్నారు.
ఈ బిల్లులోని కొత్త ఆర్టికల్స్ 303, 30ఎ ప్రకారం లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాని.. అదే విధంగా 332 ఎ ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లలో రిజర్వేషన్ దక్కుతుందని తెలిపారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడిన అన్ని సీట్లలో.. మూడవ వంతు సీట్లు కూడా మహిళలకు రిజర్వ్ చేయబడతాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే మహిళలు రాజకీయంగా చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి తెర దించినట్లు అవుతుందని తెలిపారు.
మహిళా సాధికారత కొన్ని పార్టీలకు రాజకీయ ఎజెండా అని కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. అందుకే గతంలో ఈ బిల్లును 4 సార్లు తీసుకువచ్చినప్పటికీ ఆమోదం పొందలేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీ కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వం తమ ప్రభుత్వానికి జవసత్వాలని తెలిపారు. ఇక ఓబీసీ కోటాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. 85 మంది బీజేపీ ఎంపీలు, 29 మంది మంత్రులు ఓబీసీ వర్గానికి చెందినవారేనని స్పష్టం చేశారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వం తమ ప్రభుత్వానికి జవసత్వాలని తెలిపారు. ఇక ఓబీసీ కోటాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. 85 మంది బీజేపీ ఎంపీలు, 29 మంది మంత్రులు ఓబీసీ వర్గానికి చెందినవారేనని స్పష్టం చేశారు.