తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యగమనిక. దర్శన టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్, వసతి గదులు డిసెంబర్ నెలకు సంబంధించి బుక్ చేసుకోవడానికి.. ఆన్‌లైన్ కోటాకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు ఇప్పటికే విడుదల అయ్యాయి. నేడు (శనివారం) అంగ ప్రదక్షిణల టికెట్లు 10 గంటలకు విడుదల అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇవాళ ఉదయం 11 గంటలకు దర్శనం, వసతి గదుల కోటా విడుదల చేస్తారు. అలాగే వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లను ఇవాళ (శనివారం) సాయంత్రం 3 గంటలకు జారీ చేస్తారు.
మరోవైపు రూ.300 దర్శన టికెట్లను ఈ నెల 25 (సోమవారం)న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వాస్తవానికి ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉంది కానీ.. ఈ నెల 24న ఆదివారం కావడంతో 25కు మార్చారు. అలాగే వసతి గదులకు సంబంధించి తిరుపతిలో గదుల్ని ఈ నెల 26న.. అలాగే 27న తిరుమలలో గదులు విడుదల చేయనున్నారు. భక్తులు ఈ షెడ్యూల్‌ను గమనించి దర్శన టికెట్లు, వసతి గదుల్ని బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు పల్లకీ ఉత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి. చెన్నై నుంచి వచ్చిన కళాకారులు గురువాయూరప్పన్ అనే నృత్యకళలో శ్రీకృష్ణలీలలను చక్కగా ఆవిష్కరించారు. గుజరాతీ ప్రాచీన జానపద కళారూపం గర్భ. కళ్యాణం అనంతరం దంపతులతో కలిసి చేసే ఆనందతాండవ కళారూపం ఇది. దీన్ని సుమన బృందం అత్యంత మనోహరంగా ప్రదర్శించింది. యం.జి.కటేకర్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర నుండి వచ్చిన డ్రమ్స్ వీనులవిందుగా సాగింది. మధ్యప్రదేశ్ ప్రాచీన జానపద కళారూపమైన బరిడిని పుష్కల బృందం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాజమండ్రికి చెందిన రాణి బృందం మయూర నృత్యంతో కనువిందు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశీ పుణ్యక్షేత్రంలో శివతత్వాన్ని తెలిపే అఘోర నృత్యాన్ని రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ బృందం శివలాస్యంతో నేత్రానందాన్ని కలిగించింది.
రాజమండ్రికి చెందిన లక్ష్మీ ప్రసన్న బృందం తలం నృత్యంతో అలరించింది. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరుకు చెందిన అనురాధా క్రాంత్ బృందం భరతనాట్యంతో ఆకట్టుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన మహదేవన్ బృందం ప్రదర్శించిన గోపికా నృత్యం చక్కగా సాగింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నట్టువ అనే ఈ ప్రాచీన జానపద కళారూపాన్ని పద్మమాలిని బృందం తమ కళానైపుణ్యంతో ఆకట్టుకున్నారు. తిరుపతికి చెందిన చందన బృందం తమ కోలాట నృత్యంతో అలరించింది. మొత్తం 11 కళాబృందాల్లో 248 మంది కళాకారులు పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి వాహనసేవలో కళాబృందాల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి కళాకారులను ప్రోత్సహించారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజగోపాల రావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa