కర్ణాటకకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. అయితే అంతటితో ఆగకుండా దానికి సంబంధించి మరిన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. శాంతియుత పోరాటం చేస్తే భారత దేశానికి ఎన్నటికీ స్వాతంత్ర్యం వచ్చేది కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బసనగౌడ పాటిల్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్, బీజేపీల మధ్య మరోసారి తీవ్ర మాటల యుద్ధానికి కారణం అయ్యాయి.
తాజాగా జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన బసనగౌడ పాటిల్. భారత్కు మొదటి ప్రధాన మంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని.. నెహ్రూ కానే కాదని పేర్కొన్నారు. నిరాహార దీక్షల వల్ల మన దేశానికి స్వాతంత్ర్యం రాలేదని బాబా సాహెబ్ అంబేడ్కర్ ఒక పుస్తకంలో రాశారని చెప్పారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపిస్తూ శాంతియుతంగా పోరాటం చేస్తే భారతదేశానికి స్వాతంత్ర్యం ఎన్నటికీ వచ్చేది కాదని.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిషర్లను భయపెట్టడం వల్లే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని కామెంట్లు చేశారు.
ఇక మన దేశానికి బ్రిటీషర్లు స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ తొలి ప్రధాని అయ్యారని.. అప్పటికే సొంత కరెన్సీ, జెండా, జాతీయ గీతం ఉన్నాయని తెలిపారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ కాదు అని చెప్పడానికి ఇదే కారణమని వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషర్లు భారత్‌ను వదిలి వెళ్లారని అప్పటికి ఆజాద్ హింద్‌ఫౌజ్‌ను నడిపిస్తున్న సుభాష్ చంద్రబోసే దేశ ప్రధాని అని పేర్కొన్నారు. అందుకే మన తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ప్రధాని మోదీ కూడా చెబుతుంటారని బసనగౌడ పాటిల్ చెప్పడం గమనార్హం. ఇక బసనగౌడ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్త కాదు. కర్ణాటకలో ఇటీవల కొలువుదీరిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్.. వచ్చే 6, 7 నెలల్లో కూలిపోతుందని ఆగస్టు బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. బసనగౌడ పాటిల్ గతంలో కేంద్ర రైల్వే, జౌళి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.