ఇంటిపై తండ్రీకొడుకులు కలిసి పాకిస్థాన్ జెండాను ఎగురువేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తీవ్రంగా స్పందించి.. సదరు అబ్బాకొడుకులపై చర్యలు తీసుకున్నారు. పాక్ జెండాను తొలగించి దేశద్రోహ చట్టం కింద కేసు నమోదుచేసి తండ్రీకొడుకులిద్దరినీ అరెస్ట్ చేశారు. మొరాదాబాద్ జిల్లా భగత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధన్‌పూర్ అలీగంజ్ గ్రామానికి చెందిన వస్త్ర వ్యాపారి రయీస్ ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురుతోన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు వెంటనే ఆ గ్రామానికి చేరుకునేసరికి అతడి ఇంటి పైకప్పుపై పాకిస్థాన్ జెండా రెపరెపలాడుతోంది. సాక్ష్యాధారాల కోసం ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలు రికార్డుచేసిన పోలీసులు.. ఆ తర్వాత జెండాను తొలగించారు. అనంతరం రయీస్, అతడి కుమారుడు సల్మాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరిపై దేశద్రోహ నేరం ఆభియోగాలతో ఐపీసీ సెక్షన్ 153ఏ, 153బీ కింద కేసు నమోదు చేశారు. పోలీసులతో పాటు స్థానిక ఇంటెలిజెన్స్ విభాగం కూడా వారిని విచారిస్తోంది. నిందితులిద్దరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు. వారి ఇంటిపై పాకిస్థాన్ జెండాను ఎగురవేయడానికి గల కారణాలపై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు, అయితే వారు ప్రస్తుతానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
నివేదికల ప్రకారం.. జాతీయ ఐక్యత, భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలపై తాము కఠిన చర్యలు తీసుకున్నామని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని, అత్యంత సీరియస్‌గా వ్యవహరిస్తున్నామని తెలిపారు. వారి చర్యల గురించి తెలిసినవారంతా కోపంతో రగిలిపోతున్నారు. జన్మనిచ్చిన దేశాన్ని గౌరవించాలనే ఇంగితాన్ని మరిచిన ఇలాంటి ద్రోహులను.. దేశం నుంచి వెళ్లగొట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే.. తాము ఎంతగానో ఇష్టపడే పాక్‌కు పంపడమే ఉత్తమమని అంటున్నారు.