జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నట్టా.. లేనట్టా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. పవన్ ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో, విడిపోతాడో ఆయనకే తెలియదంటూ చురకలంటించారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420 అంటూ ఘాటు విమర్శలు చేశారు. కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అవినీతి, అక్రమాల పుట్ట. చంద్రబాబు లాయర్లు 17A సెక్షన్ ప్రకారం అరెస్ట్ చట్ట విరుద్ధమంటున్నారు. రాష్ట్ర ఖజానా దోచుకున్న దొంగ చంద్రబాబు. ఈ దొంగను పట్టుకోవడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని వాదిస్తున్నారు. సెక్షన్ 17A రాకుండానే నమోదైన కేసు ఇది. చంద్రబాబు 2004లో ముఖ్యమంత్రిగా దిగిపోయే సరికి కమీషన్లకు కక్కుర్తి పడేవాడు. 2014లో లోకేష్ ఎంటరయ్యాక దొంగ అకౌంట్లకు ప్రభుత్వ సొమ్ము తరలించి విచ్చలవిడిగా దోచేశారు. చంద్రబాబు అవినీతి చేయలేదని కాకుండా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని కేసు కొట్టేయమనడం సిగ్గుచేటు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420. చంద్రబాబు, టీడీపీ ఎన్ని డ్రామాలు చేసినా.. గరిటెలు, పళ్లాలు కొట్టినా ప్రజలు క్షమించరు. చంద్రబాబు లోపలుంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, ఎవరికి పనికొస్తాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.