పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపైనా సీఎం వైయస్ జగన్ శుక్రవారం కేంద్ర హోంమంత్రితో చర్చించారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని అభ్యర్థించారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ. 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు డబ్బు విడుదలచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు చేసిన విజ్ఞప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించిందని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్నారు. లైడార్ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని ఆమేరకు నిధులు విడుదలచేయాలని అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.