టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుపై జిల్లాలో రిలే నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. 'ధర్మానికి సంకెళ్లా’ అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు న్యాయమే గెలుస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి చరఖాపై నూలు వడికి నిరసన తెలిపారు వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఆమదాలవలసలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మాట్లాడుతూ సైకో జగన్.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. కాశీబుగ్గలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ.. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుందని తెలిపారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ఎచ్చెర్లలో డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన టీడీపీ నేతల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. కోటబొమ్మాళిలో భజన బృందాలతో భక్తిగీతాలు ఆలపిస్తూ నిరసన తెలిపారు. కొత్తూరులో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు.