టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆగస్టు 4న సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళుతున్నప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో చంద్రబాబును ఏ-1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై తెలుగు దేశం పార్టీ నేతలు హైకోర్టులను ఆశ్రయించగా.. విచారణ జరిపి బెయిల్ మంజూరు చేశారు.
చంద్రబాబు కూడా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దురుద్దేశ పూర్వకంగా చంద్రబాబును ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. చంద్రబాబుపైనే రాళ్లదాడి జరిగిందని.. దాడిలో ఎన్‌ఎస్‌జీ సిబ్బంది ఆయన్ను రక్షించారన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు బెయిల్ మంజూరైందని.. తాజాగా మరికొందరికి ముందస్తు, మరికొందరికి సాధారణ బెయిల్ మంజూరు చేశారని కోర్టుకు వివరించారు.చంద్రబాబు చేసిన వ్యాఖ్యల కారణంగా దాడి జరిగిందని పోలీసు తరపు న్యాయవాది వాదించారు. ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ కోర్టు తీర్పును వెల్లడించింది. మరోవైపు చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. ముందస్తు బెయిల్ కోరారు. ఆ పిటిషన్‌పైనా నేడు విచారణ జరగనుంది. అంతేకాదు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైనా ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ పిటిషన్ల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో కూడా బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్‌పై విచారణనుకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది