ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి పరిణామం జరిగింది. మాజీ మంత్రికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. జగనన్న ఇళ్ల జిల్లా స్థాయి ప్రారంభ కార్యక్రమం చీమకుర్తి మండలం కె.వి.పాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, కలెక్టర్ దినేష్‌కుమార్, అధికారులు హాజరయ్యారు. జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు పూర్తిస్థాయిలో హాజరుకాలేదు. ఈ కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా దూరంగా ఉన్నారు.
ఈ విషయంలో అధికారులను బాధ్యులను చేస్తూ మాజీ మంత్రి బాలినేనికి తన తరఫున, బూచేపల్లి తరఫున సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు క్షమాపణలు చెప్పారు. రాజకీయ, అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. అదే సమయంలో జిల్లాలో మరే ఇతర ఎమ్మెల్యేలు, నాయకుల పేర్లను సుధాకర్‌బాబు ప్రస్తావించ లేదు. 'వాసన్నా.. నీ అండదండలు, దీవెనలు నాకు, నా సోదరుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి మెండుగా ఉన్నాయి. అధికారుల వల్ల కొన్ని పొరపాట్లు చోటుచేసుకున్నాయి. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు' అన్నారు. అందుకుగాను బాలినేనికి తన తరఫున, బూచేపల్లి తరఫున సభాముఖంగా క్షమాపణలు తెలియజేస్తున్నాను అన్నారు. ఇకపై ఇటువంటి పొరపాట్లకు అధికారులు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వొద్దని.. రేప్పొద్దున పెళ్లయితే ఈ రోజు ఆహ్వానం ఇస్తే ఎవరూ రారని వ్యాఖ్యానించారు. కొన్ని పద్ధతులు, సంస్కారాలు, సంప్రదాయాలు ఉంటాయి అన్నారు. నాలుగైదు నెలల్లో ఎన్నికలున్నాయని.. ప్రతి విషయాన్ని గమనించి చిన్న పొరపాట్లు కూడా దొర్లకుండా చూడాలి అన్నారు. అందరు ఎమ్మెల్యేలకు ఆహ్వానం ఇచ్చి ఉంటే అందరూ వచ్చి ఉండేవారన్నారు.