స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. డీహైడ్రేషన్ వల్ల చంద్రబాబుకు అలర్జీ వచ్చినట్టు వైద్యులు కూడా ధ్రువీకరించారు. తాజాగా, దీనిపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్‌కు రఘురామ లేఖ రాశారు. డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారని.. బరువు తగ్గారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మరింత బరువు తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. హానికరమైన స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నాని, ఈ విషయంపై దృష్టి సారించాలని గవర్నర్‌ను కోరారు. చంద్రబాబుకు వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే, చంద్రబాబుకు వచ్చిన అలర్జీ సమస్యపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డీహైడ్రేషన్ వల్ల అలర్జీ సమస్య మరింత ఎక్కువవుతుంది.. ఏ సమస్య లేనివారికి డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు చర్మంపై పగుళ్లు వస్తాయి.. అప్పటికే అలర్జీతో బాధపడుతున్నవారికి వాటి వల్ల మరింత జఠిలమవుతుంది.. ప్రాణాంతకంగా కూడా మారుతుంది.. ముట్టుకుంటే స్కిన్ వచ్చేస్తుంది.. అలాంటిప్పుడు ఇన్‌ఫెక్షన్ చేరి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.. జైల్లో ఉండి ఒకటి రెండు కిలోలు పెరిగారన్న భాస్కర్ రెడ్డి అనారోగ్యం ఉందని చెబితే బెయిల్ ఇచ్చారు.. ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్న చంద్రబాబుకు ఎందుకు బెయిల్ ఇవ్వరు.. 30 రోజుల్లో ఐదు కిలోలు బరువు తగ్గడం సాధారణ విషయం కాదు.. అలర్జీ సమస్యతో ఒకేసారి బరువు తగ్గినప్పుడు కిడ్నీపై తీవ్ర ప్రభావం ఉంటుంది.. తీవ్ర పరిణామాలు ఉంటాయి.’ అని రఘురామ వ్యాఖ్యానించారు.
మరోవైపు, చంద్రబాబు బరువు తగ్గలేదని, కిలో పెరిగారని కోస్తా జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ అన్నారు. ఆయన జైలుకు వచ్చేటప్పటికి 66 కిలోలు ఉంటే... ప్రస్తుతం 67 కిలోలు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు భద్రత, ఆరోగ్యానికి సంబంధించి జైల్లో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారురు. చంద్రబాబుకు సంబంధించిన ఆహారాన్ని జైలర్ స్టాయి అధికారులు పరిశీలిస్తారని డీఐజీ పేర్కొన్నారు. అంతేకాదు, చంద్రబాబు బ్యారేక్ నుంచి బయటికి వచ్చిన సమయంలో ఇతర ఖైధీలు అధికారులు, సిబ్బంది లేకుండా చూసుకుంటామని, ఆయన ఆరోగ్య రీత్యా జైలు వచ్చిన ఆయన వెంట తీసుకొచ్చిన ఔషధాలను వేసుకుంటాన్నారో లేదో వైద్యులు పర్యవేక్షిస్తుంటారని వివరించారు.