నిత్యావసరాల ధరలు పెరిగితే సామాన్యుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతాయి. కొన్నిసార్లు ఎన్నికల్లో అవే కీలక అస్త్రాలు అవుతాయి. అప్పటివరకు మెజారిటీతో అధికారంలో ఉన్న పార్టీని కూడా గద్దె దించేలా పరిస్థితులు ఎదురవుతాయి. అచ్చం ఇలాగే ఉల్లి ధరల పెరుగుదలతో గతంలో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ సీఎం కుర్చీ.. కమలం పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 25 ఏళ్లుగా ప్రతీ ఎన్నికల్లో విశ్వ ప్రయత్నాలు చేసినా కాషాయ పార్టీ మాత్రం ప్రతిపక్ష స్థానానికే పరిమితం అవుతోంది. ఢిల్లీలో ఉల్లి ధరల పెరుగుదలతో 25 ఏళ్ల క్రితం కోల్పోయిన అధికారాన్ని ఇప్పటికీ బీజేపీ దక్కించుకోలేకపోతోంది. ప్రస్తుతం కూడా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో పార్టీలకు కొత్త భయం నెలకొంది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరల్లాగానే గతంలో 1998 లో కూడా ఢిల్లీలో ఉల్లి మంట పుట్టించింది. అప్పటివరకు కిలో ఉల్లి పాయలు రూ.1.50, రూ.2 కే అమ్ముతుండగా.. ఒకేసారిగా వాటి ధర కిలోకు రూ.30 కి చేరింది. 1998 లో కిలో ఉల్లిపాయలు రూ.30 అంటే చాలా ఎక్కువ ధర అన్నట్టే. దీంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అదే ఏడాదిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ శాసనసభకు ఉన్న 70 సీట్లకు గానూ 1993లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 43 స్థానాలు గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. అప్పుడు ఢిల్లీ సీఎంగా దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ ఎన్నికయ్యారు. ఇక తర్వాత 1998 లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం 15 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ సీఎం పదవి బీజేపీకి కలగానే మారింది.
అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన ఉల్లి ధరలను కంట్రోల్ చేయడంలో బీజేపీ సర్కారు విఫలమైందని అప్పట్లో పేద, మధ్య తరగతి వర్గాల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో 1998 లో బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలైంది. ఆ తర్వాత వరుసగా 3 సార్లు అంటే 15 ఏళ్ల పాటు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పింది. ఆ తర్వాత పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా గెలుస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అట్టిపెట్టుకుని ఉంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగడం.. వచ్చే ఏడాది లోక్‌సభతోపాటు మరిన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనుండగా.. మరోసారి ఉల్లి ధరలు పెరుగుతుండటం పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. 1998 లో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు నెలకొంటాయా అని తీవ్ర ఆందోళనలో పడ్డాయి.