ఓ నిండు ప్రాణాన్ని కాపాడేందుకు ‘గుండె’ ప్రత్యేక విమానంలో తరలివెళ్లింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 22 ఏళ్ల యువకుడి నుంచి సేకరించిన గుండెను విజయవాడ నుంచి తిరుపతి పద్మావతి హాస్పిటల్‌కు తరలించారు. ఇందు కోసం పోలీసులు ‘గ్రీన్ ఛానెల్’ ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి విమానంలో గుండెను తరలించి.. అక్కడ నుంచి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ఎక్కడా ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
కృష్ణా జిల్లా చిన్నముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయ ప్రకాష్ (22) ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించకపోవడంతో డాక్టర్లు ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించారు. అవయవదానం గురించి జయప్రకాష్ కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకు రావడంతో వెంటనే అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేశారు. జయప్రకాష్ గుండెను వేరుచేసిన వైద్యులు.. గ్రీన్ ఛానల్ ద్వారా రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. గ్రీన్ ఛానెల్ మార్గంలో తిరుపతి పద్మావతి ఆస్పత్రికి గుండెను తరలించారు.
కడప జిల్లా పులివెందుల నియోజకర్గం వేముల మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన పేరం కోటేశ్వర రెడ్డి (32) గుండె సంబంధిత రుగ్మతతో పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా జయప్రకాష్ గుండెను అమర్చేందుకు వైద్యులు సర్జరీకి ఏర్పాట్లు చేశారు. జయప్రకాష్ తాను చనిపోతూ.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు.