పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చెందిన మహిళ అమెరికాలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా బయటపడింది. మహిళ సోదరుడు జయకర్ చెబుతున్న వివరాల ప్రకారం.. ఆకివీడుకు చెందిన బోడ్డు నమ్రతకు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన జాన్‌తో 2006లో వివాహమైంది. భర్త సాప్ట్‌వేర్ ఇంజినీర్ కావటంతో 2010లో అమెరికాలోని అట్లాంటా వెళ్లి నివాసం ఉంటున్నారు.. వారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. వివాహం తర్వాత కొద్ది రోజుల నుంచి నమ్రతను కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలని భర్త ఒత్తిడి చేస్తుండేవారని ఆమె సోదరుడు జయకర్ అన్నారు.
ఉద్యోగం విషయంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి అన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె వాల్‌మార్ట్‌లో ఉద్యోగంలో చేరారని.. ఇద్దరు ఉద్యోగం చేస్తున్నా నెల తిరిగే సరికి మొత్తం ఖర్చు చేసి మరింత డబ్బులు కావాలని నమ్రతను వేధింపులకు గురి చేసేవారన్నారు. ఈ ఒత్తిడితో నమ్రతకు 2018లో మొదటిసారి గుండెపోటు వచ్చిందని.. అప్పుడు స్టంటు వేశారన్నారు. ఆడపడుచులు కూడా జాన్‌తో కలిసి వేధించేవారన్నారు జయకర్.
ఈ క్రమంలోనే అక్టోబర్ 21న భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగిందన్నారు. ఆమె తీవ్ర ఒత్తిడితో అక్టోబర్ 22న ఆదివారం ఉదయం ఇంట్లో వంట చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారన్నారు. వైద్యులు పరీక్షించి ఒత్తిడితో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు నిర్ధారించారని.. విషయం తెలియగానే తమ ఖర్చులతో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువస్తామని చెప్పినా వినిపించుకోకుండా అక్కడే అంత్యక్రియలు చేశారని జయకర్ ఆరోపిస్తున్నారు. అంత హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని.. భర్త, ఆడబిడ్డల వేధింపులు, ఒత్తిడి వల్లే నమ్రత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమెరికా వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది.