రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్న రిజర్వు బ్యాంకు.. వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. ఆర్బీఐ నిర్దేశించిన గడువు ముగిసినా.. ఇంకా చాలా మంది వద్ద పెద్ద మొత్తంలో రూ.2,000 నోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయల వద్ద మార్చికి అవకాశం కల్పించింది. దీంతో ఆర్‌బీఐ ఆఫీసుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ కడుతోన్న జనం.. నోట్ల మార్పిడికి ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ అవకాశాన్ని కొందరు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కూలీలను పెట్టుకుని మరీ నోట్లను మార్పుకుంటున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.
దీంతో ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు రంగంలోకి దిగారు. ఆర్బీఐ కౌంటర్లలో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు వచ్చినవారిపై నిఘా పెట్టారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆర్బీఐ కౌంటర్ వద్ద క్యూలో నిలబడ్డవారిని ప్రశ్నించిన అధికారులు. ఇతరుల నోట్లను మార్చేందుకు వచ్చారా? అని ఆరా తీశారు. రూ.2వేల నోట్లను మార్చుకోవడానికి కూలీలను నియమించుకుంటున్నారనే మీడియా కథనాల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. రూ.20 వేలు డిపాజిట్ చేసిన వారికి రూ.300 కూలీ చెల్లిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
‘రూ.2 వేల నోట్ల మార్పిడికి వచ్చినవారి ఆధార్ కార్డులను పరిశీలిస్తున్నాం.. వారు చేసే పని ఏంటో ఆరాతీస్తున్నాం.. క్యూలో నిలబడ్డ చాలా మంది వద్ద సరిగ్గా 10 నోట్లే ఉన్నాయి. అందరి దగ్గర ఒకే మొత్తం అలా ఎలా ఉంటుంది? నిజంగానే తమ కోసం మార్చుకునేందుకు వచ్చారా? లేదా అని అనుమానించేందుకు కారణాలు ఉన్నాయి’ అని ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు. క్యూలో ఉన్నవారిని ప్రశ్నించడమే కాకుండా.. ఆర్బీఐ కౌంటర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని వారు పరిశీలిస్తున్నారు.
మరోవైపు, తమను ఈఓడబ్ల్యూ అధికారులు ఎవరూ కలవలేదని ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ ఎస్పీ మొహంతి తెలిపారు. క్యూలో ఉన్నవారిని ప్రశ్నించి ఉండొచ్చని.. వారు ఏదైనా వివరణ కోరేందుకు వస్తే పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఇదివరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉండగా.. ఆర్బీఐ కౌంటర్కు వీరంతా ఎందుకు వచ్చారని ప్రశ్నించగా.. వారికి రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయని మొహంతి బదులిచ్చారు. కాగా, మరోవైపు, క్యూలో నిలబడే అవసరం లేకుండా రూ.2 నోట్లను పోస్ట్ ద్వారా కూడా పంపి మార్పిడి చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ తాజాగా ప్రకటించడం ఊరట నిచ్చే అంశం.