లెబనాన్ సరిహద్దుల్లోని హెజ్‌బొల్లా ఉగ్రవాదులకు అధునాతన క్షిపణులను పంపడానికి రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ సిద్ధమైనట్టు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం లెబనాన్ సరిహద్దుల్లో హెజ్‌బొల్లా ఉగ్రవాదులు, ఇజ్రాయేల్ సైన్యం మధ్య ఘర్షణ జరుగుతోన్న విషయం తెలిసిందే. వైమానిక దాడుల కోసం యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ఎస్ఏ-22, ఫిరంగుల సరఫరాపై రష్యా ప్రయివేట్ సైన్యం, హమాస్‌కు మద్దతిస్తోన్న హెజ్‌బొల్లా మధ్య జరిగిన చర్చలను ప్రస్తుతం అమెరికా అధికారులు నిశితంగా గమనిస్తున్నారన్న వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదికను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఎస్ఏ-22 వ్యవస్థను పాంసీర్-S1 అని కూడా పిలుస్తారు. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్టిలరీ ఆయుధ వ్యవస్థను రష్యా తయారుచేసింది. ఈ ఆయుధాలను రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉపయోగించారు. ఇరాన్ మద్దతున్న హెజ్‌బొల్లా మిలీషియా సమూహం ఇజ్రాయేల్ వైమానిక దాడులను అడ్డుకోడానికి మధ్య ఆసియాలో వీటిని మోహరించనుంది. ఇదే సమయంలో, ఇజ్రాయేల్-హమాస్ యుద్ధం తీవ్రతరం కావడంతో లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయేల్, హెజ్‌బొల్లా మధ్య ఘర్షణలు కూడా పెరిగాయి.
అమెరికా అధికారుల ప్రకారం.. ఎస్ఏ-22 ఇంకా లెబనాన్‌కు సరఫరా కాలేదు. అయితే కొంతమంది హెజ్‌బొల్లా, వాగ్నర్ సిబ్బంది ప్రస్తుతం సిరియాలో ఉన్నారని హైలైట్ చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. అయినప్పటికీ, ఇజ్రాయేల్‌తో పోరాటంలో హమాస్‌కు సహకరించడానికి ఈ ఆయుధాన్ని లెబనాన్ నుంచి గాజాకు రవాణా చేయవచ్చా? అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. అంతేకాకుండా వాగ్నర్, హెజ్‌బొల్లా మధ్య జరిగిన చర్చలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై రష్యా అధికారులు కూడా ఇంకా వ్యాఖ్యానించలేదు. ఇజ్రాయేల్‌తో పోరులో హమాస్‌కు సాయం చేయకుండా హెజ్‌బొల్లాను నిలువరించడానికి తూర్పు మధ్యధరా ప్రాంతంలో వైమానిక నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అమెరికా తన ఉనికిని చాటుకుంది.
అక్టోబరు 7న ఇజ్రాయేల్ హమాస్‌పై యుద్ధం ప్రకటించినందున.. ఆ దేశ సరిహద్దులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బయట పార్టీలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ హమాస్, హెజ్‌బొల్లా, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ చీఫ్‌లు ఇజ్రాయేల్‌పై ఉమ్మడి యుద్ధాన్ని ప్రకటించడానికి గత వారం సమావేశమయ్యారని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ‘ప్రజలపై ఇజ్రాయేల్ ద్రోహపూరిత, క్రూరమైన దూకుడును ఆపడానికి గాజా, పాలస్తీనాలో ప్రతిఘటనకు నిజమైన విజయ సాధనకు ఈ ముగ్గురు కలుసుకున్నారు’ అని గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ పేరుతో ఒక ప్రకటన వెలువడింది.