ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మరోసారి ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కీలక డిమాండ్‌పై సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు కేటగిరీల ప్రకారం పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైంది. 2020, జనవరి 1 కంటే ముందు (ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయకముందు) నుంచి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్ నిబంధనలనే వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరినవారికి సర్వీసు నిబంధనలను అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పీటీడీ సర్వీసు నిబంధనల్లోని సెక్షన్ 5ను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఆర్డినెన్స్ ఇచ్చింది.. అనంతరం సవరణ బిల్లునూ ఆమోదించింది. త్వరలోనే తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తారు.. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.
2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు వంటివి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకే కల్పిస్తారు. గతంలో ఆర్టీసీలో ఉద్యోగులుగా నియమితులైవారికి పదోన్నతులకు సంబంధించి విద్యార్హతల నిబంధనలు ప్రత్యేకంగా ఉండేవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే.. ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు. గతంలో తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు పొంది.. పదోన్నతులకు అర్హత కలిగిన ఉద్యోగులు తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలతో నష్టపోయే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సరైన విధాన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేనాటికి ఉద్యోగులుగా ఉన్నవారికి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉద్యోగులుగా ఉన్న దాదాపు 50 వేల మందికి ఆర్టీసీ సర్వీసు నిబంధనలే వర్తిస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తారు. ప్రస్తుతం ఆ కేటగిరీలో ఆర్టీసీలో 311 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి.