అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్న ఇద్దరు వ్యక్తులను అనంతపురం జిల్ల్లా స్పెషల్ బ్రాంచి పోలీసులు, ఇటుకలపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన తెలిపారు. వారి నుంచి 60 కర్ణాటక టెట్రా ప్యాకెట్లతో పాటు ఓ నాటు తుపాకినీ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన నడిమిదొడ్డి పెన్నోబుళేసు, రాప్తాడులోని మైనార్టీ కాలనీలో నివాసముంటున్న కన్నయ్య (స్వస్థలం బళ్లారి జిల్లా కొట్టాల గ్రామం)గా గుర్తించామన్నారు. బుధవారం పోలీస్‌కాన్ఫరెన్స హాల్‌లో ఆయన మీడియాకు తెలిపిన సమాచారం మేరకు.. పెన్నోబుళేసు, కన్నయ్య, మరో ముగ్గురు వ్యక్తులు స్నేహితులు. వీరు తాగుడుకు బానిసలై అప్పులు చేశారు. పెన్నోబుళేసుకు సుమారు రూ.30 లక్షల వరకు అప్పులున్నాయి. సులువుగా డబ్బు సంపాదించడానికి వీరు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెచ్చి అధిక రేట్లకు ఉప్పరపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయించేవారు. అంతేకాకుండా అప్పులవాళ్లు బెదిరించడానికి ఓ నాటు తుపాకీని అక్రమంగా నిల్వ ఉంచుకున్నారు. ఆ తుపాకిని ఉప్పరపల్లి-పసలూరు గ్రామాల మధ్యలోని ఓ గుడిసెలో దాచి ఉంచారు. బుధవారం సోదాలు నిర్వహించిన పోలీసులు మద్యం ప్యాకెట్లు, నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పెన్నోబుళేసు, కన్నయ్యను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి ముగ్గురి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.