ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి కాసుల హారం ఊరేగింపు,,,,తిరుమల నుంచి తిరుచానూరుకు తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 06:34 PM

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు తీసుకెళ్లారు.


తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగళ, బుధవారాల్లో జ‌రుగ‌నున్న గ‌జ, గ‌రుడ వాహ‌న‌సేవ‌ల్లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని మంగళవారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నవంబర్ 18న చివరి రోజు పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. మంగళవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహన సేవ జరగనుందని, ఇందుకోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాసులహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.


ముందుగా తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని ఆల‌య నాలుగు వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొచ్చారు. అనంత‌రం తిరుమ‌ల‌ నుంచి వాహ‌నంలో భ‌ద్ర‌త నడుమ తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం కాసులహారాన్ని అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ కు అంద‌జేశారు. అక్క‌డ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఊరేగింపుగా ఆల‌యం వద్దకు తీసుకెళ్లారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి అలంకరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో ప‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులను అనుగ్ర‌హించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.


ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు వ‌సంతోత్స‌వం నిర్వ‌హిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేష‌మైన గ‌జ వాహ‌నంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివ‌రి రోజైన న‌వంబ‌రు 18న పంచ‌మితీర్థానికి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్న‌ట్టు టీటీడీ జేఈవో వీర‌బ్ర‌హ్మం తెలిపారు. తిరుచానూరులో పంచ‌మితీర్థం ఏర్పాట్ల‌ను జేఈవో సోమ‌వారం త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా పుష్క‌రిణిలో గేట్లు, పంచ‌మితీర్థ మండ‌పాన్ని, ప‌ద్మ స‌రోవ‌రంను ప‌రిశీలించారు. భ‌క్తులు ఇబ్బందులు ప‌డ‌కుండా పుష్క‌రిణిలోనికి ప్ర‌వేశించేందుకు, తిరిగి బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


పంచ‌మితీర్థానికి వ‌చ్చే భ‌క్తుల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప‌టిష్టంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాల‌న్నారు. భ‌క్తుల కోసం అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు, తాత్కాలిక మ‌రుగుదొడ్లు పెద్ద సంఖ్య‌లో ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అంత‌కుముందు తిరుచానూరులోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల, న‌వ‌జీవ‌న్ కంటి ఆసుప‌త్రి, పూడి రోడ్డు వ‌ద్ద భ‌క్తులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న జ‌ర్మ‌న్ షెడ్ల‌ను జేఈవో అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa