ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా ఉండటం తెలిసిందే. నిందితుల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపించి.. యోగి ప్రభుత్వం కఠిన శిక్షలు విధిస్తోంది. ఈ క్రమంలోనే నకిలీ ఉత్పత్తులు, నకిలీ సర్టిఫికేట్లకు సంబంధించిన వ్యాపారులపై ఉక్కుపాదం పెడుతోంది. నకిలీ హలాల్ ధృవపత్రాలను ఉపయోగించి ఆహార ఉత్పత్తులను విక్రయించే అనేక మంది వ్యాపారులపై ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా అనేక కేసులు నమోదు చేశారు.
ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఆహార ఉత్పత్తులు తయారుచేయబడ్డాయని.. అందులో ఎలాంటి కల్తీ లేదని ధ్రువీకరించేదే హలాల్ సర్టిఫికేట్. ఈ హలాల్ సర్టిఫికేట్‌ను జారీ చేసే సంస్థలు.. నిబంధనలకు విరుద్ధంగా ధ్రువపత్రాలను డబ్బులు తీసుకుని అందిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసి.. ఆ ఫేక్ హలాల్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వ్యాపారులపై కేసు నమోదు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వ్యాపారులు ఇలాంటి నకిలీ హలాల్ పత్రాల ద్వారా వారు తయారు చేసిన ఉత్పత్తులను హలాల్ చేసినట్లు సర్టిఫికేట్లు పొందుతున్నారని పోలీసులు గుర్తించారు. చెన్నైకి చెందిన హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీలోని జమియత్ ఉలేమా హింద్ హలాల్ ట్రస్ట్, హలాలా కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ముంబైకి చెందిన జమియత్ ఉలేమా వంటి సంస్థలు ఈ హలాల్ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నాయని.. తెలిపారు. కాస్మోటిక్స్, టూత్ పేస్ట్‌లు, నూనెలు, సబ్బులు సహా ఇతర వస్తువులకు సంబంధించి వాటిని తయారు చేసిన సంస్థలు.. తమ ఉత్పత్తుల్లో కల్తీ జరగలేదని.. ఇస్లామిక్ చట్టానికి లోబడి ఆహార ఉత్పత్తులను తయారు చేశారని సర్టిఫికేట్లు ఇస్తున్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇలాంటి ఘటనలు పెరిగిపోవడాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అలాంటి పద్ధతులపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నకిలీ పత్రాలను ఉపయోగించి హలాల్ సర్టిఫికేట్ ముసుగులో సంపాదించిన అక్రమ డబ్బును ఉగ్రవాద గ్రూపులకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాటిని అందిస్తున్నారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా సంస్థలు హలాల్ సర్టిఫికేట్‌లను వినియోగదారులకు అందించడం ద్వారా తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు కొన్ని మతపరమైన సంస్థలు మతపరమైన మనోభావాలను ఉపయోగించుకున్నాయని పేర్కొన్నారు. కేవలం డబ్బు కోసం అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారని.. అయితే అలాంటి కంపెనీలకు ఏదైనా ఉత్పత్తికి సర్టిఫికేషన్ ఇచ్చే అధికారం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇలాంటి సంస్థలు హలాల్ సర్టిఫికెట్లు జారీ చేసి.. సమాజంలో విద్వేషాలను పెంచడమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనలపై లక్నోకు చెందిన శైలేంద్ర కుమార్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని సంస్థల ఉత్పత్తులకే ఈ హలాల్ సర్టిఫికేట్లను జారీచేసి.. అవి లేని కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీని వెనుక పెద్ద కుట్ర జరగవచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చట్టవిరుద్ధమని.. వీటి ద్వారా వచ్చిన డబ్బు దేశవ్యతిరేక కార్యకలాపాలకు చేరుతున్నాయనే ఆందోళన ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.