మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీకి పార్టీ కీలక పదవి కట్టబెట్టింది. ఆయనను దాద్రానగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలకు బీజేపీ ఇంఛార్జిగా నియమించింది. ఇక, పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించిన సూరత్ సెషన్స్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. కింద కోర్టు తీర్పుపై జిల్లా కోర్టు, గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేయగా.. అక్కడ ఆయనకు చుక్కెదురయ్యింది.
చివరకు సుప్రీంకోర్టులో రాహుల్‌కు ఊరట లభించింది. కింది కోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించడంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఇక, పూర్ణేశ్ మోదీతో పాటు సహ-ఇంఛార్జ్‌గా దుష్యంత్ పటేల్‌ను అధిష్ఠానం అపాయింట్ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన పూర్ణేశ్ మోదీ.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది.
మొదటిసారిగా 2013 ఉప-ఎన్నికల్లో సూరత్ వెస్ట్ నుంచి గెలుపొందిన పూర్ణేశ్.. 2017, 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. గతేడాది ఎన్నికల్లో లక్ష ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. 2021లో భూపేంద్ర పటేల్ క్యాబినెట్‌లో రవాణా, పౌరవిమానయాన, టూరిజం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను క్యాబినెట్‌లోకి తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, హైకమాండ్ పట్ల విధేయత కారణంగా పూర్ణేశ్ మోదీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ఇక, 2019 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కర్ణాటకలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కోర్టులో దావా వేయడం.. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతను దోషిగా నిరూపించడంతో పూర్ణేశ్ మోదీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. దేశవ్యాప్తంగా ఆయన గురించి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసు కారణంగానే రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. ఒకొనొక దశలో ఆయన రాజకీయ భవితవ్యంపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, సుప్రీం జోక్యంతో చివరకు అనర్హత నుంచి తప్పించుకుని.. మళ్లీ పార్లమెంట్‌లో వాయనాడ్ ఎంపీగా అడుగుపెట్టారు.