హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం టికెట్ ధర రూ.1000/-గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తారు. రోజుకు ఆన్‌లైన్‌లో 50 టికెట్లు, ఆఫ్‌లైన్‌లో 50 టికెట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్ టికెట్లను నవంబరు 16న టీటీడీ విడుదల చేసింది. మొదటిరోజైన నవంబరు 23వ తేదీ హోమం ఆఫ్‌లైన్ టికెట్లను నవంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం వరకు సప్తగోప్రదక్షిణ మందిరం ప్రాంగణంలో జారీ చేస్తున్నారు. భక్తులు నేరుగా వచ్చి ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. నవంబరు 24వ తేదీ నుంచి ఏరోజుకారోజు టికెట్లు మంజూరు చేస్తారు. అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో నవంబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని టీటీడీ ప్రారంభించనున్నట్లు జేఈవో సదా భార్గవి తెలిపారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం నుండి సప్త గోప్రదక్షిణ మందిరం వరకు మంగళవారం ఉదయం వివిధ కళాబృందాలతో జేఈవో ట్రయల్ రన్ నిర్వహించారు.
టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి ఆదేశాల మేరకు.. వివిధ కళాబృందాలతో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ప్రధాన భవనం నుంచి సప్త గో ప్రదక్షిణ మందిరం వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం విద్యార్థులు, వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, వివిధ కళాబృందాలతో ట్రైయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. హోమం యొక్క విశిష్టతను దేశం నలుమూలల తెలియజేయాలని ఈ యాత్రను నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో ఇంజనీరింగ్, ఆరోగ్య, అన్నప్రసాద విభాగాల ఏర్పాట్లను పరిశీలించినట్లు వివరించారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్నిరెండు గంటల పాటు నిర్వహిస్తారన్నారు ఎస్వీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి. వైఖానస ఆగమ శాస్త్రంలో చెప్పబడిన విధంగా పుణ్యాహవచనం నుండి పూర్ణాహుతి వరకు నిర్వహించు వివిధ క్రతువులను ఆయన వివరించారు. లోక కళ్యాణార్థం తిరుపతిలో 2024 ఫిబ్రవరి నెలలో దేశంలోని ప్రముఖ పండితులతో చతుర్వేద సభ ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో నిర్వహించే చతుర్వేద సభకు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1300 మంది ప్రముఖ వేద పండితులు, అహితాగ్నులు, స్కీం పారాయణదారులను ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, గార్డెన్, ఆరోగ్య, వసతి, రవాణా తదితర విభాగాలు ఏర్పాట్లపై ఇప్పటి నుండి తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa