వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ...... అభివృద్ధిలో వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వలస పోకుండా విశాఖలో ఓడ రేవును నిర్మాణం చేపడుతున్నారని వివరించారు. అమరావతి రైతులు తమ స్వార్థం కోసం ఉద్యమాలు చేస్తున్నారని, రాజధాని ఉంటే తమ భూములకు రేట్లు పెరుగుతాయని, వ్యాపారాలు వస్తాయని పోరాటాలు చేస్తున్నారని, ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే చంద్రబాబు ఇక్కడ మాఫియాలు పెరిగిపోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని రాజధాని చేస్తే అక్కడ మాఫియాలు, అన్యాయాలు, అక్రమాలు జరగవా అని నిలదీసారు. ఉత్తరాంధ్రను అవమానించేలా చంద్రబాబు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే చంద్రబాబు నోట ఇలాంటి మాటలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తూ ఉత్తరాంధ్రకు జగన్ గొప్ప వరం ఇచ్చారని, ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. ఒక మత్స్యకారుడుని పార్లమెంట్ కు పంపి ఆత్మగౌరవాన్ని జగన్ చాటి చెప్పారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేది కూడా ఓ మత్స్యకారుడైన కుప్పం నాయకుడు భరత్ కావడం ఖాయమన్నారు. ఫిషింగ్ హార్బర్ లో బోటు అగ్ని ప్రమాదం జరిగితే సీఎం జగన్ అండగా నిలిచి తక్షణ సాయాన్ని ప్రకటించారన్నారు. ప్రమాద ఘటన దగ్గరకు వచ్చి టీడీపీ, జనసేన వంటి పార్టీలు అన్యాయంగా ఆందోళన చేసాయని, ప్రభుత్వం ఉదారంగా చేయూతనిచ్చినా రాజకీయాలు చేయడం సబబు కాదని సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. మత్స్యకారులకు డబ్బు సాయం చేస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బు కాకుండా టీడీపీ నుంచి తీసుకున్న ప్యాకేజీ డబ్బు ఇస్తారని మత్స్యకారులు ఎవరూ తీసుకోవద్దని పిలుపునిచ్చారు. మత్స్యకారులపై పవన్ కు అంత అభిమానం ఉంటే, గతంలో చంద్రబాబు అవమానపరిచినపుడు ఆయన్ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసారు. సీఎం జగన్ పాలనలో మత్స్యకారులు ఆత్మగౌరవంతో జీవనం సాగిస్తున్నారని, పవన్ వంటి నేతల వద్ద చేయి చాచాల్సిన కర్మ పట్టలేదని ఎద్దేవా చేసారు.