వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు 41 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
ఆర్థిక అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ ఎంపీ రఘురామ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఆరోపించారు. ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిటిషన్‌లో ఆరోపించారు. ఈమేరకు ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై ఆధారాలను సైతం పిటిషన్‌లో రఘురామ హైకోర్టుకు అందజేసినట్లు తెలుస్తోంది.