రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్యనున్న విభేదాలు కొత్తేమీ కాదు. అదంతా బహిరంగ రహస్యమే. సీఎం పీఠం మీద ఆశలు పెట్టుకున్న సచిన్ పైలెట్‌ను కాదని 2018 ఎన్నికల తర్వాత అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొబెట్టింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఐదేళ్ల పాటు వారి మధ్య కలహాల కాపురం సాగింది. అయితే అంతర్గత కలహాలతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి అధికారాన్ని బీజేపీ పార్టీకి అప్పగించింది. అయితే ఇప్పుడు తాజాగా మరో అంశం బయటకు వచ్చింది. అశోక్ గెహ్లాట్ ఓఎస్డీ దీని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న అంతర్గత కలహాల గురించి పలు అంశాలు బయటపెట్టారు.
2020లో సచిన్ పైలెట్ నేతృత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబాటు చేశారు. 18 మంది పార్టీ ఎమ్మెల్యేలతో సచిన్ పైలెట్ అప్పట్లో మనేసర్‌లో ప్రత్యేక క్యాంపు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీంతో అశోక్ గెహ్లాట్ తన ప్రభుత్వాన్ని ముందుకు నడిపించగలిగారు. అయితే సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసిన సమయంలో అతని మీద నిఘా ఉంచినట్లు అశోక్ గెహ్లాట్ ఓఎస్డీ లోకేష్ శర్మ వెల్లడించారు.సచిన్ పైలెట్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు లోకేష్ శర్మ తెలిపారు. సచిన్ పైలట్‌తో పాటు 18 మంది ఎమ్మెల్యేలు మనేసర్‌కు వెళ్లడంతో అప్పుడు రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొందని ఆయన చెప్పారు. ప్రభుత్వం పతనం అంచున ఉందన్న ఆయన .. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే వ్యక్తుల మీద నిఘా ఉంచడం మామూలేనని చెప్పుకొచ్చారు.
అప్పట్లో సచిన్ పైలెట్ ఎప్పుడూ తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేవాడన్న లోకేష్ శర్మ.. ఒకవేళ సచిన్ పైలెట్ కాంగ్రెస్ నుంచి పక్కకు వెళ్లిపోతే ఎదురయ్యే పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వానికి ఆ చర్యలు తప్పలేదని వివరించారు. ఇలా నిఘా ఉంచడం వలనే అసంతృప్తులలో నుంచి కొంతమందిని వెనక్కి తీసుకునిరాగలిగామని అశోక్ గెహ్లాట్ ఓఎస్డీ చెప్పారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కాపాడటానికే అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. "రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నడుస్తోంది. సచిన్ పైలెట్ 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి మనేసర్ వెళ్లిపోయారు. అలాంటి పరిస్థితుల్లో వారి కదలికలను ట్రాక్ చేయడం సహజం. సచిన్ పైలెట్ ఎటువెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడనే దానిని ట్రాక్ చేయాల్సి వచ్చింది. అతని కదలికలపై నిఘా ఉంచాం, ఎవరితో ఫోన్‍లో మాట్లాడుతున్నాడనేది ట్యాప్ చేశాం. అలా చేయడం ద్వారానే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోగలం".. అని ఏఎన్ఐతో అశోక్ గెహ్లాట్ ఓఎస్డీ లోకేష్ శర్మ తెలిపారు.