ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే... ద్విచక్రవాహనంపై అసెంబ్లీకి చేరుకుని తన గెలుపు ధ్రువీకరణ పత్రాలను అధికారులుకు సమర్పించారు. ఇందుకోసం ఆయన ఏకంగా 330 కి.మీ. బైక్‌పై ప్రయాణించారు. తన కారు కాదు కదా కనీసం బైక్ కూడా లేకపోవడంతో బంధువుల వాహనం తీసుకుని ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆయనే రత్లాం జిల్లా సైలాన్ నియోజకవర్గం నుంచి భారతీయ ఆదివాసీ పార్టీ నుంచి ఎన్నికైన కమలేశ్వర్ డొడియార్. ఆ పార్టీ నుంచి విజయం సాధించింది కమలేశ్వర్ ఒక్కరే కావడం విశేషం.
తన నియోజకవర్గం నుంచి రాజధాని భోపాల్‌కు బైక్‌పై ప్రయాణాన్ని సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చారు. తనకు కారు కొనే స్తోమత లేదని, సొంత బైకు కూడా లేదని, తన బంధువు ద్విచక్ర వాహనాన్ని తీసుకొని వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి రాష్ట్ర రాజధాని పర్యటనకు వెళ్లేందుకు కారును ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా అది కుదరలేదని తెలిపారు. చివరకు తన బావ బైక్‌ను తీసుకుని, ముందు ఎమ్మెల్యే స్టికర్ అతికించుకుని భోపాల్‌కు పయమైనట్టు పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలి వణికిస్తుండగా.. బైక్ నడుపుకుంటూ బుధవారం రాత్రి భోపాల్‌కు చేరుకున్నారు.
భోపాల్ చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే రెస్ట్ హౌస్‌లో అతిథిగా బస చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీకి చేరుకుని.. ప్రవేశ ద్వారం ముందు సాష్టాంగ పడి ప్రజాస్వామ్య దేవాలయానికి నివాళులర్పించారు. అనంతరం అధికారులకు ఎమ్మెల్యేగా తన ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కమలేశ్వర్ డొడియార్.. ప్రధాని మోదీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రత్లాం పోలీసులను ట్యాగ్ చేశారు. ‘ఎమ్మెల్యే డోడియార్ తన గెలుపు పత్రాలను భోపాల్‌లోని అసెంబ్లీ అధికారులకు అందజేయడానికి వెళ్లేందుకు కారు లేనందున తాను మోటర్‌బైక్‌పై బయలుదేరుతున్నట్టు చెప్పారు. దారిలో అవాంఛనీయమైన ఘటన ఏమీ జరగకుండా అవసరమైన భద్రత కల్పించాలి’ అని కోరారు.
తన ప్రయాణాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్ టెలికాస్ట్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా చదివిన కమలేశ్వర్.. భారతీయ ఆదివాసీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్‌పై విజయం సాధించారు. అతి నిరుపేద కూలీ కుటుంబానికి చెందిన కమలేశ్వర్‌కు ఎన్నికల్లో పోటీచేయడానికి చాలా మంది ఆర్దిక సాయం చేశారు. తానకు చాలా మంది జనం విరాళాలు సేకరించి ఇచ్చారన్నారు. కొంత మంది వద్ద అప్పులు చేసి ఎన్నికల్లో ఖర్చు చేశానని ఎమ్మెల్యే వెల్లడించారు.