వైసీపీ పాలనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ పై ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమ’ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరింత ఉత్సాహంతో పనిచేసి వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, 20న భోగాపురం మండలంలో నిర్వహించనున్న యువగళాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సీఎం జగన్ మోసపూరిత హామీలు ఇచ్చి.. 38 శాతం మాత్రమే అమలు చేశారు. దాడులు, దమనకాండలు, హత్యలు, అత్యాచారాలు, కూల్చివేతలు, కక్షసాధింపులతోనే వైసీపీ పాలన కొనసాగుతోంది. ఈ అరాచకపాలనపై త్వరలో పుస్తకాలు విడుదల చేయనున్నాం. ఎన్నికలకు ముందు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉద్దానాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటున్న మీకు ఏ మాత్రమైనా సిగ్గుందా? అని సీఎం జగన్‌ను, వైసీపీ నాయకులను ఆయన ప్రశ్నించారు. ‘టీడీపీ హయాంలోనే పలాసలో కిడ్నీరీసెర్చ్ సెంటర్‌కు శ్రీకారం చుట్టాం. శ్రీకాకుళం, పాలకొండ, ఇచ్ఛాపురం, పలాస, కవిటి, టెక్కలిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ముందుగా టెక్కలిలో డయాలసిస్ కేంద్రాం ప్రారంభించాం. తర్వాత ఎన్నికలు రావడంతో మిగిలినవన్నీ మరుగున పడేశారు. ఇప్పుడు పలాసలో మాత్రమే కిడ్నీరీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎర్రన్నాయుడు హయాంలోనే నెలకొల్పిన ఉద్దానం నీటి పథకానికి.. కేంద్ర ప్రభుత్వం సుజలధార ద్వారా నీరు ఇస్తే.. దీనిని వైసీపీ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరం’గా ఉందన్నారు. ‘టీడీపీ పాలనలో 16 ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేశాం. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్నా ఒక్క మండలాన్ని కూడా ప్రకటించకపోవడం అధికారపార్టీ నేతల అసమర్థతకు నిదర్శనం. జిల్లాలో ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం తప్పదు’ అని అచ్చెన్న హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, ఎల్.ఎల్ నాయుడు, పినకాన అజయ్, బగాది శేషగిరి, బోయిన రమేష్, జీరు భీమారావు, వెలమల కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, కర్రి విష్ణుమూర్తి, మట్ట సుందరమ్మ, చౌదరి బాబ్జి పాల్గొన్నారు.